వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమవుతున్నారు. స్టార్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టడానికి పోటాపోటీ పడుతున్నారు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 29 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. అనూహ్య స్పిన్, అస్థిర బౌన్స్ వికెట్లకు కారణం అనుకుంటే పొరపాటే.
రోహిత్ చెత్త షాట్‌తో వికెట్ చేజార్చుకున్నాడు. శుభ్‌మన్ గిల్ బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎడమచేతి వాటం స్పిన్ తన బలహీనత అని విరాట్ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఫుల్ టాస్ బంతికి వెనుదిరిగాడు. బ్యాటర్లు సాధారణ ప్రదర్శనతోనే టీమిండియా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది.

రోహిత్ 11 బంతుల్లో 11 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే హిట్ మ్యాన్ చెత్త షాట్ ఎంపికతో ఔటయ్యాడు. అన్ని బంతులకు దూకుడు మంత్రమే సరైనదిగా భావించి వికెట్ సమర్పించుకున్నాడు. మ్యాట్ హెన్రీ వేసిన బంతిని పుల్‌షాట్‌కు యత్నించి గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కాడు. కాస్త క్లిష్టమైన క్యాచ్‌ను ఫిలిప్స్ ఎలాంటి పొరపాటు చేయకుండా అందుకున్నాడు.
శుభ్‌మన్ గిల్ నాలుగు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. అజాజ్ పటేల్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై వికెట్ కోల్పోయాడు. బంతి దూరంగా స్పిన్ అవుతుందని భావించి బ్యాటుతో ఢిఫెన్స్ చేయడానికి గిల్ ప్రయత్నించలేదు. కానీ బంతి ఆఫ్ స్టంప్‌పైకి దూసుకొచ్చింది. తన ప్యాడ్లతో డిఫెన్స్ చేసినా గిల్ ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకునేవాడు. ఔటైన అనంతరం బంతి తీరును చూసి గిల్ క్రీజులోనే నోరెళ్లబెట్టాడు.
విరాట్ కోహ్లి ఏడు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేశాడు. ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ చేతిలో వికెట్ సమర్పించుకోవద్దని తీవ్రంగా చేసిన కోహ్లి శ్రమ మరోసారి వృథాగానే మారింది. అజాజ్ పటేల్ చేతిలో కంగుతిన్నాడు. సాలిడ్ ఫార్వర్డ్ డిఫెన్స్ చేయలేక ఔట్ సైడ్ ఎడ్జ్‌తో స్లిప్‌లో ఉన్న డారిల్ మిచెల్ చేతికి చిక్కాడు.
సర్ఫరాజ్ ఖాన్ రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేశాడు. అజాజ్ పటేల్ వేసిన ఫుల్ టాస్ బంతిని స్వీప్ షాట్‌కు యత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చాడు. ఇక యశస్వీ జైస్వాల్ వికెట్ కాస్త చెప్పుకోదగ్గది. ఫిలిప్స్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. బంతి ప్యాడ్-బ్యాట్‌కు ఒకేసారి తాకిందని జైస్వాల్ రివ్యూకి వెళ్లగా థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు.
Gill castled 💥
— JioCinema (@JioCinema) November 3, 2024
Watch Day 3 LIVE on #JioCinema #Sports18 & ColorsCineplex👈#INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/HTdvnvcrdq