బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 31.2 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఇది మూడో అత్యల్ప స్కోరు. కివీస్ ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఒరూర్క్ (4/22) ధాటికి.. టీమిండియా బ్యాటర్లు వణికిపోయారు. ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఏకంగా అయిదుగురు డకౌటయ్యారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేదు. 9/1, 9/2, 10/3, 31/4, 33/5, 34/6, 34/7, 39/8, 40/9, 46/10.. ఇలా వరుసగా వికెట్లు చేజార్చుకుంది. రిషభ్ పంత్ (20), యశస్వీ జైస్వాల్ (13) కలిసి నాలుగో వికెట్‌కు జోడించిన 21 పరుగులే అత్యధిక భాగస్వామ్యం. మరే ఇతర జోడీ కనీసం రెండంకెల స్కోరు భాగస్వామ్యాన్ని నమోదు చేయకపోవడం గమనార్హం.

మహ్మద్ సిరాజ్ 4 పరుగులు (నాటౌట్), రోహిత్ శర్మ , కుల్‌దీప్ యాదవ్ చెరో రెండు పరుగులు, జస్‌ప్రీత్ బుమ్రా ఒక్క పరుగు చేయగా, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ అయిదు, ఒరూర్క్ నాలుగు వికెట్లు, సౌథి ఒక్క వికెట్ తీశారు. కివీస్ సంచలన బౌలింగ్‌తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన చేసింది.
మేఘూవృతమైన వాతావరణం, పిచ్‌పై ఉన్న కాస్త తేమను న్యూజిలాండ్ బౌలర్లు గొప్పగా ఉపయోగించుకున్నారు. మరోవైపు టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణయం భారత్‌కు కలిసిరాలేదు. అనుభవంతో సరైన ప్రదేశాల్లో న్యూజిలాండ్ బౌలర్లు సంధించిన బంతులకు మన బ్యాటర్ల వద్ద సమాధానం లేకపోయింది. రోహిత్‌ను టిమ్ సౌథి చక్కని డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి.. ఒరూర్క్ వేసిన ఊహించని బౌన్స్‌ను అంచనా వేయడంలో విఫలమై గ్లెన్ ఫిలిప్స్ చేతికి చిక్కాడు.
గిల్ గాయపడటంతో తుదిజట్టులోకి వచ్చిన సర్ఫరాజ్..డెవాన్ కాన్వే అద్భుత క్యాచ్‌కు ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. కానీ ఒరూర్క్ ధాటికి జైస్వాల్, కేఎల్ రాహుల్ (0) నిలవలేకపోయాడు. లంచ్ విరామానికి ముందు ఆఖరి ఓవర్‌లో మ్యాట్ హెన్రీ జడేజాను డకౌట్ చేయడంతో భారత్ 34 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్‌లో కివీస్ ముందు టీమిండియా ఎక్కువ సేపు నిలవలేకపోయింది.