పుష్కర కాలం నుంచి సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోని అజేయ రికార్డును పదిలంగా ఉంచుకోవడానికి టీమిండియాకు పుణె టెస్టు ఎంతో కీలకం. అంతేగాక వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తుకు అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి న్యూజిలాండ్‌ను ఓడించడం భారత్‌కు తప్పనిసరి. ఈ నేపథ్యంలో పుణె వేదికగా నేటి నుంచి కివీస్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా భారీ మార్పులు చేసింది.
మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్‌లు తుదిజట్టులో చోటు కోల్పోయారు. వాళ్ల స్థానంలో ఆకాశ్ దీప్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. అయితే బుధవారం జరిగిన మీడియా సమావేశంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఫాస్ట్ బౌలర్ల పనిభారం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండో టెస్టు ఫలితాన్ని బట్టి పేసర్ల వర్క్ లోడ్‌ను తగ్గించేలా తగిన విశ్రాంతి ఇస్తామని చెప్పాడు. కానీ పుణె టెస్టులోనే సిరాజ్‌ను పక్కనబెట్టారు.

అయితే సిరాజ్‌ను తప్పించడానికి విశ్రాంతి కారణం కాదని తెలుస్తోంది. గత కొంతకాలంగా స్వదేశంలో జరిగే టెస్టుల్లో ఈ హైదరాబాదీ పేసర్ పేలవ ప్రదర్శన చేస్తుండటంతో జట్టు నుంచి తప్పించారని సమాచారం. విదేశాల్లో నిప్పులు చెరిగే సిరాజ్ సొంతగడ్డపై మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ప్రధానంగా రెండో ఇన్నింగ్స్‌లో డీఎస్పీ సిరాజ్ పూర్తిగా తేలిపోతున్నాడు. గత ఏడు టెస్టుల్లో రెండో ఇన్నింగ్స్‌లో ఒక్కవికెట్ కూడా పడగొట్టలేదు. ఓవరాల్‌గా 12 వికెట్లు తీశాడు.
ఉప్పల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో లోకల్ బాయ్ సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వికెట్ సాధించలేదు. ఇంగ్లండ్‌తో రాంచీ టెస్టులో రెండు వికెట్లు తీసిన సిరాజ్ ధర్మశాల టెస్టులో వికెట్ పడగొట్టలేకపోయాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి, రెండు టెస్టుల్లో రెండేసి వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు సాధించిన సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌ను తుదిజట్టు నుంచి పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.