తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టుకు సిద్ధమైంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా గురువారం నుంచి రెండో టెస్టు ఆడనుంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి అపకీర్తి మూటగట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత టీమిండియా పుంజుకుని గొప్పగానే పోరాడింది. కానీ విజయాన్ని అందుకోలేకపోయింది.
టెస్టు సిరీస్‌ను నిలుపుకోవాలంటే రేపటి నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో భారత్ తప్పక సత్తాచాటాలి. కివీస్‌ను చిత్తు చేసి సిరీస్‌పై గురిపెట్టాలి. అంతేగాక వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు రేసులో నిలవడానికి పుణె టెస్టు టీమిండియాకు ఎంతో కీలకం. అయితే పుణె టెస్టు అనంతరం భారత తుది జట్టులో భారీ మార్పులు ఉంటాయని కోచ్ గౌతరమ్ గంభీర్ పేర్కొన్నాడు. మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

పనిభారం దృష్ట్యా తుదిజట్టులో భారీ మార్పులు చేస్తామని, ఫాస్ట్ బౌలర్లకు విశ్రాంతి ఇస్తామని గంభీర్ చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం ఆసీస్ పర్యటనకు 10-12 రోజుల సమయమే ఉండటంతో పేసర్లకు విశ్రాంతి అవసరమని భావిస్తున్నట్లు అన్నాడు. అయితే ఇదంతా రెండో టెస్టులో వచ్చే ఫలితంపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు.
''న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు 10-12 రోజులు ఉంటాయి. మా ఫాస్ట్ బౌలర్ల విశ్రాంతికి ఆ సమయం సరిపోతుంది. అయితే కివీస్‌తో రెండో టెస్టు అనంతరం జస్‌ప్రీత్ బుమ్రాను పర్యవేక్షణలో ఉంచుతాం. బుమ్రాను మాత్రమే కాదు, ఫాస్ట్ బౌలర్ల అందరి పనిభారం గురించి ఆలోచిస్తాం. వాళ్లను ఫ్రెష్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తాం''
''ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ సుదీర్ఘమైనది, ఎంతో ముఖ్యమైనది. అలాగే పనిభారం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో రెండో టెస్టు ఫలితాన్ని, అలాగే మా బౌలర్ల ఓవర్లను బట్టి నిర్ణయాన్ని తీసుకుంటాం'' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు సిరీస్ నుంచి వరుసగా మూడు టెస్టుల్లో బుమ్రా, సిరాజ్ తుదిజట్టులో కొనసాగుతున్నారు. కాగా, నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.