IND vs NZ: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. రెండో టీ20లో కివీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి.. ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా.. చివర్లో శివం దూబే తన పవర్ హిట్టింగ్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ ఇషాన్ కిషన్ (76) అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతడికి తోడుగా మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ (82) మైదానం నలుమూలలా షాట్లతో విరుచుకుపడటంతో కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు. వీరిద్దరి ధాటికి రన్ రేట్ ఆకాశాన్ని తాకింది.

మ్యాచ్ ముగింపు దశలో క్రీజులోకి వచ్చిన శివం దూబే (13 బంతుల్లో 36 పరుగులు) తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు బాదిన ఒక సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. బంతి బ్యాట్‌కు తగిలిన వెంటనే స్టేడియం బయట పడేంత వేగంతో దూసుకెళ్లింది. ట్రాకింగ్ ప్రకారం ఈ సిక్సర్ ఏకంగా 100 మీటర్ల దూరం నమోదైంది. శివం దూబే కొట్టిన ఈ భారీ షాట్ చూసి డ్రెస్సింగ్ రూంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఈ సిక్సర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
సిరీస్ నిర్ణయాత్మక పోరుకు సిద్ధం
ఈ విజయంతో భారత్ సిరీస్‌లో బలమైన స్థితికి చేరుకుంది. ఇక అందరి కళ్లు రేపు (ఆదివారం) గౌహతి వేదికగా జరగనున్న మూడో టీ20పైనే ఉన్నాయి. ఇదే ఊపును కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా పట్టుదలతో ఉంది.