IND vs NZ: న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య భారత్ ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ క్లాసిక్ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ.. బౌలర్ల వైఫల్యం, వ్యూహాత్మక తప్పిదాల వల్ల భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఈ ఓటమికి దారితీసిన ప్రధాన కారణాలను ఒక్కసారి విశ్లేషిస్తే..
బ్యాటింగ్ వైఫల్యం.. ఆరంభం అదిరినా..
భారత్ ఓటమికి తొలి అడుగు బ్యాటింగ్‌లోనే పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్‌ల పుణ్యమా అని వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కేవలం 48 పరుగుల వ్యవధిలో భారత్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం జట్టును దెబ్బతీసింది.హాఫ్ సెంచరీతో మంచి టచ్‌లో కనిపించిన కెప్టెన్ గిల్, దానిని భారీ సెంచరీగా మార్చడంలో విఫలమయ్యాడు. ఒక దశలో 250 పరుగులు కూడా కష్టమనుకున్న స్థితిలో కేఎల్ రాహుల్ (112 నాటౌట్) ఒంటరి పోరాటం చేసి జట్టుకు 284 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు. కానీ ఈ పిచ్‌పై అది ఏమాత్రం సరిపోలేదని తేలిపోయింది.

2. కెప్టెన్ గిల్ వ్యూహాత్మక తప్పిదం
ఫీల్డింగ్ సమయంలో కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు జట్టుపై ఒత్తిడిని తగ్గించాయి. న్యూజిలాండ్ 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు, భారత్ అటాకింగ్ బౌలింగ్‌ను కొనసాగించాల్సింది. 13వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ తీసిన తర్వాత, తర్వాతి ఓవర్లో సీనియర్ పేసర్లు సిరాజ్ లేదా హర్షిత్ రాణాను ప్రయోగించి ఉంటే కివీస్‌పై పట్టు బిగించే అవకాశం ఉండేది. అనుభవం లేని నితీష్ రెడ్డికి బౌలింగ్ ఇవ్వడం కివీస్ బ్యాటర్లు డారిల్ మిచెల్, విల్ యంగ్‌లకు వరంగా మారింది. వారు స్వేచ్ఛగా షాట్లు ఆడి క్రీజులో నిలదొక్కుకున్నారు. అక్కడి నుండే మ్యాచ్ భారత్ చేతుల్లోంచి జారిపోయింది.
3. చేతులెత్తేసిన స్పిన్నర్లు
భారత గడ్డపై టీమిండియాకు బలం స్పిన్ బౌలింగ్. కానీ ఈ మ్యాచ్‌లో అదే బలహీనతగా మారింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కెరీర్‌లోనే అత్యంత పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు. 10 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ తీశాడు. సీనియర్ ఆటగాడు అయిన రవీంద్ర జడేజా కూడా కివీస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయాడు. 8 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ప్రత్యర్థి బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఏమాత్రం భయం లేకుండా స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో చెడుగుడు ఆడుకున్నారు. ఈ స్పిన్నర్లు తమ ప్రభావాన్ని చూపలేకపోవడంతోనే టీమిండియా పరాజయం పాలైంది. మూడో వన్డేలోనైనా అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాలి.
బ్యాటింగ్‌లో టాపార్డర్ వైఫల్యం, బౌలింగ్‌లో స్పిన్నర్ల ప్రభావం లేకపోవడం, కెప్టెన్సీలో అనుభవలేమి వెరసి భారత్‌ను ఓటమి పాలు చేశాయి. 1-1తో సిరీస్ సమం కావడంతో, ఇండోర్‌లో జరగనున్న మూడో వన్డే ఇప్పుడు నిర్ణయాత్మకంగా మారింది.