
జైపూర్: సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం కాస్త కష్టమే అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. భారత్‌ని ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొడితే మ్యాచ్‌లో పై చేయి సాధించొచ్చని బౌల్ట్ చెప్పాడు. మూడు టీ20 సిరీసులో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం తొలి టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. శుక్రవారం రెండవ టీ20 మ్యాచ్ రాంచీలో, ఇక మూడవ మ్యాచ్ కోల్‌కతాలో ఆదివారం జరగనున్నాయి.
తొలి టీ20 మ్యాచ్ నేపథ్యంలో ట్రెంట్ బౌల్ట్ మీడియాతో మాట్లాడుతూ... 'ప్రతిఏడాది ఐపీఎల్ టోర్నీలో ఆడటంతో ఇక్కడి పిచ్‌లపై మంచి అవగాహన ఏర్పడింది. ఎలా బౌలింగ్ చేయాలి, ఎన్ని పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాల్లో స్పష్టత వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మా జట్టుకు కలిసొచ్చే అంశాలు. ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొడితే.. మ్యాచ్‌లో పై చేయి సాధించొచ్చు. అందుకోసం ఎలా బౌలింగ్ చేయాలో నాకు తెలుసు. ప్రస్తుతం మా ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం కాస్త కష్టమే' అని అన్నాడు.
టీమిండియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ దూరం అయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత కొద్దికాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న న్యూజిలాండ్ విలియమ్సన్‌కు కివీస్ బోర్డ్ విశ్రాంతినిచ్చింది. నవంబర్ 25 నుంచి కాన్పూర్‌లో జరగనున్న టెస్టు సిరీస్ కోసం కేన్ ప్రిపేరవుతున్నాడని, దాని కోసమే టీ20 మ్యాచ్‌లకు దూరం అవుతున్నట్లు కివీస్ బోర్డు తెలిపింది. బుధవారం నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు కివీస్ బౌలర్ టిమ్ సౌథీని తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. ఇప్పటికే భారత్‌కి చేరుకున్న న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ సన్నాహాలు ప్రారంభించింది.
మరోవైపు టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోవడంతో నయా సారథిగా రోహిత్ శర్మ, కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌లను బీసీసీఐ నియమించింది. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్.. ఇండియా-ఏ, అండర్-19 కోచ్‌గా తనదైన ముద్ర వేసిన ద్రవిడ్ కాంబినేషన్‌లో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా సన్నాహకాలు ప్రారంభించనుంది. జైపూర్‌లో బుధవారం తొలి టీ20 కోసం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో పిచ్ సిద్ధమవుతోంది. భారీ స్కోర్లు ఖాయమని అంటున్నారు. గత ఎనిమిదేళ్లలో ఇక్కడ టీమ్‌ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక్కడ టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ మైదానంలో బౌండరీలు పెద్దగా ఉన్నాయి. అయితే పిచ్ మందకొడిగా లేదని క్యురేటర్ తపష్ ఛటర్జీ చెప్పాడు.