IND vs NZ: భారత గడ్డపై మరో రసవత్తర క్రికెట్ పోరుకు తెరలేచింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ నేడు(బుధవారం) ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ ముందు రెండు జట్లకు ఇదే చివరి సిరీస్ కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే గత కొన్ని నెలలుగా న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయాలు భారత అభిమానులను కలవరపెడుతున్నాయి.
కివీస్ చేతిలో వరుస గాయాలు
గత 15 నెలల కాలాన్ని గమనిస్తే.. న్యూజిలాండ్ జట్టు భారత్‌కు సొంతగడ్డపైనే ఊహించని షాకులు ఇచ్చింది. మొదట టెస్ట్ సిరీస్‌లో టీమిండియాను 3-0తో క్లీన్ స్వీప్ చేసి, భారత గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా కివీస్ చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌లో కూడా కివీస్ పైచేయి సాధించి భారత్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో కూడా అదే జోరును కొనసాగించి, వరల్డ్ కప్ ముందు భారత్‌ను మానసిక ఒత్తిడిలోకి నెట్టాలని కివీస్ భావిస్తోంది.

నాగ్‌పూర్.. భారత్‌కు కలిసిరాని చరిత్ర
నాగ్‌పూర్ మైదానంలో టీమిండియా రికార్డు ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఇప్పటివరకు భారత్ 5 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. అందులో మూడింటిని మాత్రమే గెలుచుకుంది. ముఖ్యంగా 2016 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇదే మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ కేవలం 79 పరుగులకే కుప్పకూలి.. 47 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ మైదానంలో కివీస్ బౌలర్లు భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన తీరు ఇప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం.
సూర్యకుమార్ ఫామ్.. టీమిండియాకు అతిపెద్ద సవాలు
భారత జట్టును వేధిస్తున్న మరో ప్రధాన సమస్య కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్. గత 18 నెలలుగా సూర్య బ్యాట్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రావడం లేదు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరున్న సూర్య, వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీకి ముందు ఫామ్ అందుకోవడం జట్టుకు చాలా కీలకం. అయితే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ల రాకతో బౌలింగ్, ఆల్‌రౌండ్ విభాగాల్లో జట్టు బలంగా కనిపిస్తోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి యువ ఆటగాళ్లు ఆరంభంలోనే మెరుపులు మెరిపిస్తే భారత్‌కు విజయావకాశాలు మెరుగుపడతాయి.
హెడ్-టు-హెడ్, పిచ్ అంచనాలు
టీ20ల్లో ఇరు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే, భారత్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. మొత్తం 25 మ్యాచ్‌ల్లో భారత్ 12 గెలవగా, న్యూజిలాండ్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నాగ్‌పూర్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు, స్లో బౌలర్లకు సహకరిస్తుంది. అందుకే ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ పాత్ర చాలా కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలని ప్రయత్నించవచ్చు.
టెస్ట్, వన్డేల్లో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. వరల్డ్ కప్ ముందు ఈ సిరీస్ గెలవడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరి నాగ్‌పూర్ గండం దాటి భారత్ బోణీ కొడుతుందో లేదో వేచి చూడాలి!
జట్లు ఇలా ఉన్నాయి:
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, అర్ష్‌దీప్,రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా.
న్యూజిలాండ్: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, ఈష్ సోధి, రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్, మ్యాట్ హెన్రీ తదితరులు.