ఐర్లాండ్ మహిళల జట్టుతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుతం చేసింది.
ఐర్లాండ్‌ను భారీ తేడాతో ఓడించి వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఏకంగా 304 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పరుగుల పరంగా చూసుకుంటే టీమిండియా అత్యధిక తేడాతో విజయం సాధించిన మ్యాచ్ ఇదే కావడం విశేషం. అంతకుముందు ఐర్లాండ్‌పైనే 2017లో ఏకంగా 249 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. 436 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు.. 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలిపోయింది. సారా (41), ఓర్లా (36) మాత్రం కాస్త రాణించారు. టీమిండియా బౌలర్లలో తనూజా 2, దీప్తి 3, సయాలీ 1, సాధు 1, మిన్ను మని 1 వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 435/5 రికార్డు స్కోరు చేసింది. ప్రతికా రావల్ (154), స్మృతీ మంధాన (135) సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేశారు.
ఛేదనలో మ్యాచ్ సాగిందిలా..
మూడో వన్డేలో ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు భారత బౌలర్లు. 436 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఐర్లాండ్ ను స్వల్ప వ్యవధిలోనే వికెట్లను కోల్పోయేలా చేశారు. కెప్టెన్ గాబీ లూయిస్ (1), కౌల్టర్ (0) మరీ దారుణంగా విఫలమయ్యారు. మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్ కాసేపు నిలకడ ప్రదర్శన చేసింది. ఓర్లా (36)తో కలిసి మూడో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. లారా డెలానీ (10), లేహ్ పాల్ (15), కెల్లీ (2) అంతా చేతులెత్తేశారు.
స్మృతి, ప్రతీక అద్భుత సెంచరీలు - టీమిండియా భారీ స్కోర్
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాలో ఓపెనర్లు స్మృతి మంధాన (135), ప్రతీకా రావల్ (154) ఆది నుంచే దూకుడుగా ఆడి సెంచరీలు నమోదు చేశారు. మొదటి వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వన్డేల్లో టీమిండియా తరఫున వేగవంతమైన (70 బంతుల్లో) శతకాన్ని బాదింది స్మృతి. మంధాన ఔట్ అవ్వగానే రిచా ఘోష్ (59)తో కలిసి స్కోరును ముందుతీసుకెళ్లింది ప్రతీకా. అనంతరం రిచా కూడా పెవిలియన్ చేరాక తేజల్ (28), హర్లీన్ (15)తో కలిసి ప్రతీకా పరుగులు చేసింది. దీంతో వన్డే చరిత్రలో టీమిండియా తొలిసారి 400+ స్కోరును దాటింది. 435 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా 2 వికెట్లు పడగొట్టగా, కెల్లీ, ఫ్రేయా, డెంప్సీ తలో వికెట్ దక్కించుకున్నారు.
