
హైదరాబాద్: ఆసియాకప్‌లో భారత్ శుభారంభం చేసింది. హాంకాంగ్‌తో చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యఛేదనలో హాంకాంగ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది.
అంతకముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (120 బంతుల్లో 127; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో 14వ సెంచరీతో చెలరేగగా, అంబటి రాయుడు (70 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించారు.
వీరిద్దరు రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం హాంకాంగ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 259 పరుగులు చేసి ఓడింది. నిజాకత్ ఖాన్ (115 బంతుల్లో 92; 12 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అన్షుమన్ రత్ (97 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ప్రదర్శన చేశారు. సెంచరీతో రాణించిన ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
హాంకాంగ్ ఓపెనర్ల జోరు..
భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్‌కు ఓపెనర్లు నిజాకత్ ఖాన్, అన్షుమన్ రాత్ అద్భుత శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా ఫోర్లతో స్కోరు వేగం తగ్గకుండా చూశారు. అదే సమయంలో నిజాకత్ ఖాన్ 45 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఓపెనర్ల జోరుకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో భారత్ కంటే ముందుగా 18వ ఓవర్లో (17.4)నే జట్టు స్కోరు వంద దాటింది. టీమిండియా 20వ ఓవర్లో (19.4) వికెట్ కోల్పోయి 100 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ టైమ్ బౌలర్లతో పాటు, పార్ట్‌టైమ్ బౌలర్లను ప్రయోగించినా ఓపెనింగ్ జోడీని విడదీయలేకపోయాడు. మరో ఓపెనర్ అన్షుమన్ కూడా 75 బంతుల్లో (3 ఫోర్లు) హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
ఇది రోహిత్ శిబిరాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. హంకాంగ్ జట్టేమో అలవోకగా 30.3 ఓవర్లలో 150 పరుగుల్ని చేసింది. ఈ జోడీని విడగొట్టేందుకు భారత కెప్టెన్ తరచు బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో ఇద్దరు మొదటి వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 35 ఓవర్లో కుల్దీప్ యాదవ్ ఈ జోడిని విడదీశాడు.
జట్టు స్కోరు 174 పరుగుల వద్ద కెప్టెన్ అన్షుమన్... రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో సెంచరీకి చేరువైన నిజాకత్ ఆట కూడా ముగిసింది. పరుగు వ్యవధిలో ఖలీల్ అహ్మద్ వేసిన తర్వాతి ఓవర్లోనే అతను వికెట్ల ముందు దొరికిపోయాడు. 175 పరుగుల వద్ద క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లిద్దరు నిష్క్రమించారు.
ఆ తర్వాత ఖలీల్ బౌలింగ్‌లో కార్టర్ (3) నిష్క్రమించగా, సిక్సర్లతో జోరుమీదున్న బాబర్ హయత్ (18; 1 ఫోర్, 2 సిక్సర్లు)ను చహల్ పెవిలియన్ బాటపట్టించాడు. ఈ రెండు క్యాచ్‌ల్ని కీపర్ ధోని అందుకున్నాడు. తర్వాత చేయాల్సిన పరుగులు, అందుబాటులో ఉన్న బంతుల మధ్య అంతరం పెరగడంతో ఒత్తిడిలో హాంకాంగ్ ఓడిపోయింది. భారత బౌలర్లలో కొత్త కుర్రాడు ఖలీల్ అహ్మద్, చహల్ మూడేసి వికెట్లు తీయగా, కుల్దీప్‌కు 2 వికెట్లు దక్కాయి.
రోహిత్ శర్మ ఔట్, ధావన్ హాఫ్ సెంచరీ
ఆసియా కప్ టోర్నీలో భాగంగా మంగళవారం భారత్-హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హాంకాంగ్ జట్టు కెప్టెన్ అన్షుమన్ రాత్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
దీంతో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ తొలి ఓవర్‌లోనే ఫోర్ కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. అయితే జట్టు స్కోరు 45 పరుగుల వద్ద హాంకాంగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు.
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ టోర్నీ నుంచి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ దూకుడుగా ఆడినప్పటికీ, ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో హాంకాంగ్ బౌలర్ ఇషాన్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్ కోసం రోహిత్ శర్మ ప్రయత్నించగా బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి మిడాఫ్‌లో గాల్లోకి లేచింది. అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న నిజాఖత్ అలవోకగా క్యాచ్ అందుకున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
60 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన తర్వాత ఆడుతున్న తొలి వన్డేలోనే హాఫ్ సెంచరీ సాధించడం గమనార్హం. నిజాఖత్ వేసిన ఇన్నింగ్స్ 19.1వ బంతికి లాంగాన్‌లో రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు.