భారత్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ తమ జట్టు గొప్పగా పోరాడిందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్నాడు.అయిదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ఆఖరి టెస్టు జరగనుంది.
అయితే సిరీస్ ఓడినప్పటికీ ఇంగ్లండ్‌కు సానుకూలాంశాలు ఉన్నాయని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ స్థాయికి చేరే భవిష్యత్ స్టార్ షోయబ్ బషీర్ తమకు దొరికాడని అన్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన టెస్టులో షోయబ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీసిన అతడు రాంచీ టెస్టులో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో అయిదు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు.

''ఇంగ్లిష్ క్రికెట్‌కు ఇది అద్భుతమైన వారం. ప్రపంచ స్థాయికి చేరే సూపర్ స్టార్ షోయర్ బషీర్‌ను మేం కనుగొన్నాం. అందుకే ఇది గొప్ప వారంగా భావిస్తున్నాం. తన రెండో టెస్టు మ్యాచ్‌లోనే బషీర్ ఎనిమిది వికెట్లు తీశాడు. అతడు ఓ'కొత్త అశ్విన్'. కొత్త సూపర్ స్టార్‌ను మేం పొందినందుకు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం'' అని షోయబ్ బషీర్‌పై మైకేల్ వాన్ ప్రశంసల జల్లు కురిపించాడు.
''ఇక ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని భావిస్తున్నా. యాషెస్ సిరీస్‌లో మాదిరిగానే ఈ సిరీస్‌లోనూ మెరుగైన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. సెషన్ల వారిగా పరిశీలిస్తే ఇంగ్లండ్ జట్టు ఉత్తమం అని తెలుస్తుంది. అయితే మెరుగైన జట్టు గురించి మాత్రమే నేను చెబుతున్నా. సిరీస్ గెలవడానికి మేం పోరాడుతామని చెప్పట్లేదు'' అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు.
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో మాత్రమే ఇంగ్లండ్ విజయం సాధించింది. 28 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల్లో భారత్ విజయకేతనం ఎగురవేసింది. వైజాగ్ టెస్టులో 106 పరుగులు, రాజ్‌కోట్ టెస్టులో 434 పరుగులు, రాంచీ మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది.