రాజ్‌కోట్ వేదికగా రేపటి నుంచి భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్ గెలిచి ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. రాజ్‌కోట్ టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యానికి దూసుకెళ్లాలని ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే బజ్‌బాల్‌తో వస్తున్న ఇంగ్లండ్‌ను ఎదుర్కోవడానికి తమ దగ్గర ప్రణాళిక ఉందని టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. పరుగులు సమర్పించుకునేలా తమ జట్టు బౌలింగ్ చేయదని తెలిపాడు.
''ఇంగ్లండ్ టీమ్‌ది దూకుడుగా ఆడే స్వభావం. ఇక్కడ పరిస్థితుల్లో ప్రత్యర్థి జట్టు దూకుడుగా ఆడటం గతంలో అంత సులువు కాదు. కానీ ఇంగ్లండ్ హిట్టింగ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. కొన్నిసార్లు వాళ్లు కనెక్ట్ అవుతారు, మరికొన్నిసార్లు కనెక్ట్ అవ్వలేరు. అయినా అదే తరహాలో వాళ్లు బ్యాటింగ్ చేస్తారు. ఈ స్థితిలో మనం ప్లాన్-బి గురించి ఆలోచించాలి. మన ఫీల్డింగ్ ఎలా ఉంది? దానికి తగ్గట్లుగా బంతులు సంధించాలి. వాళ్లకు పరుగులు సమర్పించేలా మేం బౌలింగ్ చేయం''

''వాళ్లు షాట్‌లకు ప్రయత్నించినప్పుడు.. మనం ఎక్కడ బౌలింగ్ చేయాలో ఆలోచించుకోవాలి. వాళ్లు ఎక్కువగా స్వీపింగ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ బౌలింగ్ ఛేంజ్ చేయకుండా, సింపుల్‌గా బౌలింగ్ చేస్తే ఉత్తమం అని భావిస్తున్నా. భిన్నంగా ఏం ఆలోచించట్లేదు. ఒక్క బాల్ టర్న్ అవుతూ, మరో బాల్ నేరుగా వికెట్లకు సంధిస్తా. అదే నా ప్లాన్. ఇక పిచ్ విషయానికొస్తే కఠినంగా అనిపిస్తుంది. ఆదిలో వికెట్ బాగుటుంది. ఆ తర్వాత వికెట్ స్లో అవుతుందనుకుంటున్నా'' అని జడేజా తెలిపాడు. తొలి టెస్టులో గాయపడి రెండో టెస్టుకు దూరమైన జడేజా మూడో టెస్టులో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్/కుల్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్ తుది జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.