
ఢిల్లీ: ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడారని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడాడు. రోహిత్-రాహుల్‌ల బ్యాటింగ్ మర్చిపోలేనిదని పేర్కొన్నాడు. కొన్నిసార్లు ఈ ఇద్దరు విఫలం కావడం.. మిడిలార్డర్ వైఫల్యంతో భారత్ తక్కువ స్కోర్లకే ఆలౌట్ కావాల్సి వచ్చిందన్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మూడు టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలతో అలరించాడని సెహ్వాగ్ ప్రశంసించాడు. భారత బృందంలో కరోనా వైరస్ కేసులు వెలుగుచూడడంతో మాంచెస్టర్ వేదికగా శుక్రవారం ఇంగ్లండ్, టీమిండియా మధ్య ప్రారంభం కావాల్సిన ఐదో టెస్టు రద్దయిన సంగతి తెలిసిందే. దాంతో ఇరు జట్ల ప్లేయర్స్ ఐపీఎల్ 2021 కోసం యూఏఈ వెళ్లిపోతున్నారు.
ఈ టెస్ట్ సిరీస్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రెండు అర్ధశతక భాగస్వామ్యాలు నెలకొల్పడమే కాకుండా ఒక శతక భాగస్వామ్యం సైతం నిర్మించారు. మరోవైపు లార్డ్స్‌లో రాహుల్ (129) సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. ఓవల్‌లో రోహిత్ (127) రెండో ఇన్నింగ్స్‌లో శతకం బాది టీమిండియా విజయానికి బాటలు వేశాడు. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 2-1తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అయితే కరోనా కేసుల కారణంగా ఐదో టెస్టు రద్దు కావడంతో సిరీస్ ఫలితంపై ఎలాంటి స్పష్టత రాలేదు.
తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు... 'రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ భాగస్వామ్యాలు మరువలేనివి. లార్డ్స్ టెస్టులో సెంచరీ భాగస్వామ్యంతో పాటు నాటింగహమ్, ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో రెండు ఫిప్టీ ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేయడం జట్టుకు కలిసి వచ్చింది. వాళ్లిద్దరూ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పకపోతే.. తరచూ విఫలమౌతున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ త్వరగా క్రీజులోకి వచ్చేవారు. దాంతో భారత్ మరింత ముందుగానే ఆలౌటయ్యేది. 30-40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ ద్వయం టీమిండియాను పటిష్టస్థితిలో నిలిచేలా చేసింది. అయితే కొన్నిసార్లు ఈ ఇద్దరు విఫలం కావడం, మిడిలార్డర్ వైఫల్యంతో తక్కువ స్కోర్లకే ఆలౌట్ కావాల్సి వచ్చింది. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అదే జరిగింది' అని అన్నాడు.
'రసవత్తరంగా సాగిన ఈ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మూడు టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలతో అలరించాడు. రూట్ బ్యాటింగ్ అద్భుతం. జేమ్స్ అండర్సన్ ఇంకా వేగంగా బంతులేస్తున్నాడు. సిరీస్‌లో 2-1తో ఉన్న భారత్.. ఇంగ్లండ్‌పై ఆధిక్యంలో ఉన్నట్లే. ప్రస్తుతానికి కరోనా కారణంగా ఐదో టెస్టు మ్యాచ్ వాయిదా పడింది. మ్యాచ్ నిర్వహించాలా వద్దా అనేది ఇరు బోర్డులు చర్చించి ఒక నిర్ణయానికి వస్తాయి. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీలు మొదలవనున్నాయి. మళ్లీ వచ్చే ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా మూడు టీ20లతో పాటు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇదే సమయంలో రద్దయిన టెస్టు మ్యాచ్ నిర్వహిస్తారని భావిస్తున్నా' అని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ చేసిన పనికి టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాల్లో ఆయన చెప్పే డైలాగ్‌లకు అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతుంటారు. ముఖ్యంగా పవన్ చెప్పిన డైలాగ్‌ల్లో 'గబ్బర్‌సింగ్'లోని 'నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరి నోటి నుంచి సరదాగా ఈ డైలాగ్ వస్తుంటుంది. ఈ డైలాగ్‌ను సెహ్వాగ్ తనదైన స్టైల్లో చెప్పి అలరించాడు. పవన్ మేనరిజంను అనుసరిస్తూ మెడపై చేతులు పెట్టుకొని సెహ్వాగ్ ఈ డైలాగ్ చెప్పే ప్రయత్నం చేశాడు.