IND vs ENG:షమీ, బుమ్రా..టేక్ ఏ బో!లక్ష్మణ్, ద్రవిడ్ భాగస్వామ్యంతో పోలిక!అనుకోని హీరోలపై అభినందనల వెల్లువ!

లండన్: 'సూపర్ మ్యాచ్' అంటే ఇది.. అవును భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు చూసిన ప్రతి అభిమాని ఇలాగే ఫీల్ అయి ఉంటాడు. ఆద్యంతం ఆసక్తికరంగా ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెడుతూ సాగిన మ్యాచ్‌లో భారత్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. కోహ్లీసేన నిర్దేశించిన 272 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్ సేన 120 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ జో రూట్ (33) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. మహహ్మద్ సిరాజ్(4/32) నాలుగు వికెట్లతో విజృంభించగా.. జస్ప్రీత్ బుమ్రా (3/33), ఇషాంత్ శర్మ (2/13) రాణించారు. సెంచరీతో రాణించిన కేఎల్ రాహుల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.
షమీ, బుమ్రా అదరహో:
అయితే ఈ మ్యాచులో రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ వికెట్ పడగానే.. భారత్ ఇన్నింగ్స్ మరికొద్దిసేపట్లోనే ముగిసిపోతుందని చాలా మంది భావించారు. కానీ మహమ్మద్ షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), జస్ప్రీత్ బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) జోడి అద్భుతం చేసింది. భారత్‌కు ఊహించని ఆధిక్యాన్ని ఇచ్చింది. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు అజేయమైన 89 పరుగులు జోడించి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. వీరిరువురి పోరాటంపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి.

లక్ష్మణ్, ద్రవిడ్ భాగస్వామ్యంతో పోలిక:
షమీ, బుమ్రా ఇన్నింగ్స్‌ను ఈడెన్ గార్డెన్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్-రాహుల్ ద్రవిడ్ నెలకొల్పిన రికార్డుస్థాయి భాగస్వామ్యంతో పోల్చాడు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 445 పరుగుచేసి ఆలౌట్ అయ్యింది. భారత్ పేలవ ప్రదర్శనతో 171 పరుగులకే కుప్పకూలింది. దారుణ పరాభవం తప్పదని అందరూ భావించారు. కానీ లక్ష్మణ్-ద్రవిడ్ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరు కలిసి 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ గెలిచేలా చేశారు. వారి భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ.. పెవిలియన్‌కు చేరుకుంటున్న లక్ష్మణ్, ద్రవిడ్ ఫొటోల్లోని వారి ముఖాలను మార్చి చేసి షమీ, బుమ్రా ఫొటోలను ఉంచాడు వీరూ. వీరి కోసం చప్పట్లు కొడుతూనే ఉండాలి అని ట్వీట్ చేశాడు.

మజా ఆయేగా:
'వీరి భాగస్వామ్యాన్ని కీలకమైనదిగా పేర్కొనడం చాలా చిన్న విషయం. ఈ భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. వెల్‌డన్ మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా' అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. 'వీరి ఇన్నింగ్స్ చూస్తున్నంతసేపు మజా వచ్చింది. అద్భుతమైన భాగస్వామ్యం. వారికున్న అనుభవంతోనే ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడారు' అని వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. 'కష్టాల్లో ఉన్న టీమిండియాను షమీ, బుమ్రా అసాధారణ ప్రదర్శన చేసి కాపాడారు. వీరి ప్రదర్శన జట్టు స్వభావాన్ని తెలుపుతోంది. దీన్ని ప్రత్యేకంగా మలుచుకోండి' అని బీసీసీఐ సెక్రెటరీ జై షా ప్రశంసించారు.

హైదరాబాదీ సిరాజ్ అదరగొట్టాడు:
'అద్భుతమైన టెస్టు విజయం. భారత పేస్ బౌలింగ్ దాడి సూపర్. మన హైదరాబాదీ మొహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. మొహ్మద్ షమీ, బుమ్రా బంతి, బ్యాట్‌తో రాణించారు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్‌కు అభినందనలు' అని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ గడ్డపై భారత్ తరఫున 9వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా షమీ, బుమ్రా చరిత్రకెక్కారు. 39 ఏళ్ల కిందట 1982లో ఇదే వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత దిగ్గజాలు కపిల్ దేవ్-మదన్ లాల్ 9వ వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఇప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై భారత్ తరఫున తొమ్మిదో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యంగా ఉండింది. 39 ఏళ్ల తర్వాత ఈ రికార్డును షమీ, బుమ్రా జోడి అధిగమించడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications