
మళ్లీ నిరాశపరిచాడు:
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో అభిమానులు అతడిపై మండిపడ్డారు. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆడే అవకాశం రాలేదు. లండన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసినా... కీలక సమయంలో ఔట్ అయ్యాడు. దాంతో భారత్ భారీ స్కోర్ చేసే అవకాశం లేకుండా పోయింది ఇక రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ నిరాశపరిచాడు. నాలుగు ఫోర్లు కొట్టి జోరుమీద ఉన్నట్టు కనిపించినా.. సామ్ కరన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆజామ్‌ను చూసి నేర్చుకో:
రెండో ఇన్నింగ్స్‌లో 31 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ.. 20 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ మరోసారి విఫలమవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీపై ఫైర్ అవుతున్నారు. మరికొందరు అయితే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'విరాట్ కోహ్లీ ఇక మారవా.. ఒత్తిడిని ఎలా జయించాలో బాబర్ ఆజామ్‌ను చూసి నేర్చుకో' అని ఒకరు కామెంట్ చేయగా.. 'కరోనా వైరస్ విరాట్ కోహ్లీ శకాన్ని ముగించింది. 2020 నుంచి ఒక సెంచరీ లేదు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'ఇక దుకాణం సర్దేయాల్సిందే', 'పదేపదే అలానే ఔట్ అవుతున్నాడు', 'అబ్బా.. తృటిలో సెంచరీ మిస్ అయిందిరా నాయనా', 'సెంచరీకి 80 పరుగులే తక్కువ చేశాడు', ' ఎందుకు ఇలా ఔట్ అవుతున్నావ్' అని కామెంట్లు చేస్తున్నారు.

ఏడాదిన్నర కాలంగా:
వాస్తవానికి విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా సెంచరీ బాదాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. టెస్ట్ ఛాంపియన్‌షిఫ్ ఫైనల్లోనూ విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో ప్రారంభం అయిన టెస్ట్ సిరీస్‌లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ వస్తున్నాడు. 2008లో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన కోహ్లీ.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు.

2018లో దుమ్మురేపాడు:
2014లో తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై ఆడిన విరాట్ కోహ్లీ.. ఆ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. 5 టెస్ట్‌ల్లో కేవలం 134 రన్స్ మాత్రమే చేశాడు. జేమ్స్ అండర్సన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు ఎక్కువగా ఔటయ్యాడు. కానీ 2018 పర్యటనలో మాత్రం దుమ్మురేపాడు. ఎంతో పరిణితి సాధించిన అతడు 5 టెస్ట్‌ల్లో 59.30 సగటుతో 593 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. మళ్లీ 2021లో అదే ఇంగ్లండ్ గడ్డపై విఫలమవుతున్నాడు. ఇంకా మూడు టెస్టులు ఉన్న నేపథ్యంలో విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని అందరూ కోరుకుంటున్నారు.

70 సెంచరీలు:
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 93 టెస్టులాడి 52.00 సగటుతో 7547 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేల పరుగులు చేశాడు.

రెండో ఇన్నింగ్స్‌లో తడబాటు:
మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. నాలుగో రోజు తొలి సెషన్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. భోజన విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (5), రోహిత్ శర్మ (21), కెప్టెన్ విరాట్ కోహ్లీ (20) విఫలమయ్యాడు. ప్రస్తుతం క్రీజులో చేతేశ్వర్ పుజారా (3), అజింక్య రహానే (1) ఉన్నారు. ఆశలన్నీ ఇప్పుడు వీరిద్దరిపైనే నెలకొన్నాయి. అయితే వీరు ఫామ్ లో లేకపోవడం కలవరపెట్టే అంశం.


Click it and Unblock the Notifications












