అదే మమ్మల్ని ఒత్తిడికి గురిచేసింది.. తప్పులు సరిదిద్దుకుంటాం! ఇక రొటేషన్ పాలసీ గురించి ఆలోచిస్తాం: కోహ్లీ

లీడ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో స్కోరు బోర్డుపై ఉన్న భారీ పరుగులే టీమిండియాను ఒత్తిడికి గురిచేశాయని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇంగ్లండ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఎవరైనా కుప్పకూలడం సాధారణ విషయమని, గతంలోనూ ఇలాంటి వైఫల్యాల నుంచి మెరుగైన ప్రదర్శన చేశామని గుర్తు చేసుకున్నాడు. ఇక మిగతా రెండు టెస్టుల్లో రొటేషన్ పాలసీ గురించి ఆలోచిస్తామని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా లీడ్స్ వేదికగా శనివారం ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్టులో భారత్ ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైన భారత్.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఒత్తిడికి గురయ్యాం:
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు. 'నాలుగో రోజు మా బ్యాట్స్‌మెన్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మమల్ని తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూల్చిన తర్వాత.. రూట్ సేన భారీ స్కోర్ సాధించినప్పుడు అప్పుడే వెనుకబడిపోయామని అర్థమైంది. మూడో రోజు మేము కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాం. రోజంతా బాగా ఆడాం. కానీ రోజు ఉదయం ఇంగ్లీష్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడి తెచ్చారు. దాంతో మేము సరైన రీతిలో ఆడలేకపోయాం. ఇంగ్లండ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఇలా కుప్పకూలడం సాధారణ విషయం' అని కోహ్లీ అన్నాడు.

తప్పులు చేశాం:
'బ్యాటింగ్ చేసేందుకు ఈ పిచ్ అనుకూలంగా ఉంది. కానీ ఇంగ్లండ్ బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు సంధించడంతో మేము తప్పులు చేశాం. అలాగే మా బ్యాటింగ్‌లోనూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాయాం. మరోవైపు ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దాంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పట్టుదలతో ఆడారు. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఈ విజయానికి వారు అర్హులు. మీరు బ్యాటింగ్ డెప్త్ లేదని అనుకోవచ్చు. కానీ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మంచి స్కోర్లు సాధించాలి. దాంతో లోయర్ ఆర్డర్ పని తేలికవుతుంది. ప్రతిసారీ టెయిలెండర్లు పరుగులు చేయలేరు. సెకండ్ ఇన్నింగ్స్‌లో బాగా బ్యాటింగ్ చేయడం తప్ప మరేమీ మమ్మల్ని కాపాడదని తెలుసు' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

సమూల మార్పలు ఉంటాయి:
ఇక రెండో స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం అనేది పిచ్‌పై ఆధారపడి ఉంటుందని, దాని గురించి తర్వాత ఆలోచిస్తామని భారత సారథి విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. తమ తప్పులు తెలుసుకొని ముందుకు సాగుతామని, గతంలోనూ ఇలాంటి వైఫల్యాల నుంచి మెరుగైన ప్రదర్శన చేశామని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. ఇక మేము రొటేషన్ పాలసీ గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చిందని, జట్టులో మార్పులు చేయాల్సి ఉంటుందన్నాడు. సుదీర్ఘ పర్యటనలో ప్రతి ఒక్కరూ 4 టెస్టు మ్యాచ్‌లు ఆడతారని తాము ఊహించలేదని కోహ్లీ స్పష్టం చేశాడు. నాలుగో టెస్ట్ కోసం జట్టులో సమూల మార్పలు ఉంటాయని కోహ్లీ చెప్పకనే చెప్పాడు.

278 పరుగులకే ఆలౌట్:
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 278 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 212/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొలి సెషన్‌లోనే మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ కనీస పోరాటం చేయలేదు. మ్యాచ్ ప్రారంభమైన పది నిమిషాల నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓలి రాబిన్‌సన్ 5 వికెట్లతో రెచ్చిపోయి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఒక్కరు కూడా క్రీజులో నిలబడే ప్రయత్నం చేయలేదు. దాంతో భారత్ భారీ ఓటమిని మూటగట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications