
షమీ, బుమ్రాలు అద్భుతం:
మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'జట్టును చూస్తే చాలా గర్వంగా ఉంది. మా ప్రణాళికలకు కట్టుబడి ఉన్నాం కాబట్టే.. విజయం సాధ్యమైంది. మొదటి మూడు రోజుల్లో పిచ్ పెద్దగా సహకరించలేదు. మొదటి రోజు అత్యంత సవాలుగా మారింది. ఒత్తిడిలో ఉన్న తర్వాత మేము రెండో ఇన్నింగ్స్‌లో ఆడిన విధానం బాగుంది. మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలు అద్భుతం. జట్టుకు పోరాడే స్కోర్ అందించారు. వారి కారణంగానే 60 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టును ఆలౌట్ చేయవచ్చనే నమ్మకం వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో చాలా ఒత్తిడికి గురయ్యాం. అయినా షమీ-బుమ్రా అలా ఆడడంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం' అని అన్నాడు.

ఈ విజయం ప్రత్యేకమైనది:
'బ్యాటింగ్ కోచ్ కుర్రాళ్లతో చాలా కష్టపడ్డాడు. మేము నెం.1గా ఉన్నప్పుడు లోయర్ ఆర్డర్ నుంచి పరుగులు పొందుతున్నాము. కొన్ని రోజులు సతమతం అయ్యాం. కానీ ఇప్పుడు లోయర్-ఆర్డర్ పరుగులు చేయాలనే కోరికతో ఉన్నారు. బ్యాటింగ్ పరంగా కూడా జట్టుకు ఉపయోగపడాలనుకుంటున్నారు. ఆ పరుగులు ఎంత అమూల్యమైనవో మాకు తెలుసు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో 2014లోనూ లార్డ్స్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచినా.. 60 ఓవర్లలోపే ఇప్పుడు విజయాన్ని అందుకోవడం ఎంతో ప్రత్యేకం. మొహ్మద్ సిరాజ్ మొదటిసారి లార్డ్స్‌లో ఆడుతున్నప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు' అని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు.

పెద్ద బ్రేక్ త్రూ అదే:
'కొత్త బంతితో ఆరంభాలు లభించడమే ఈ మ్యాచులో పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పాలి. రెండో ఇన్నింగ్స్‌లో మాకు సరైన ప్రారంభం దక్కింది. బౌలర్ల ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్ర దినోత్సవం తర్వాతి రోజే ఈ విజయం దక్కడం సంతోషంగా ఉంది. దేశానికి మేము ఇచ్చిన గొప్ప బహుమతి ఇది. విజయం దక్కిందని ఇక్కడితోనే ఆగిపోము. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ గెలవడమే మా లక్ష్యం. నేను చాలా తప్పులు చేస్తున్నాను. వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంది. మూడో మ్యాచ్ కోసం కొంత సమయం ఉంది. దాన్ని ఉపయోగించుకుంటాం' అని విరాట్ కోహ్లీ చెప్పుకోచ్చాడు.

షమీ, బుమ్రా భాగస్వామ్యం:
నాలుగో రోజు ఆట చివరికి చూస్తే ఇంగ్లండ్‌దే పైచేయి. విజయానికి కూడా అవకాశాలు ఉన్నాయి. రహానే, పుజారా పోరాడడంతో భారత్ ఆధిక్యం 154 పరుగులు మాత్రమే. రిషబ్ పంత్ తప్ప మిగిలిన వాళ్లంతా టెయిలెండర్లే. అయిదో రోజు చివరి నాలుగు వికెట్లను పడగొట్టి మ్యాచ్‌పై పట్టుబిగించవచ్చని ఇంగ్లండ్ భావించింది. ఇక పంత్, ఇషాంత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే నిష్క్రమించడంతో భారత్ ఓటమి ఖాయం అనుకున్నారు అందరూ. కానీ టెయిలెండర్లు షమీ (56 నాటౌట్; 70 బంతుల్లో 6×4, 1×6), బుమ్రా (34 నాటౌట్; 64 బంతుల్లో 3×4) అభేద్యమైన 9వ వికెట్‌కు ఏకంగా 89 పరుగులు జోడించి.. భారత్‌కు ప్రమాదాన్ని తప్పించారు. అంతేకాకుండా గెలుపు కోసం ప్రయత్నించే అవకాశం కల్పించారు. షమి-బుమ్రా జోడీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఇక్కడే కోహ్లీసేన సగం విజయం సాధించింది.


Click it and Unblock the Notifications












