
శుభారంభం దక్కకపోయినా..
ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్ నాలుగో బంతికి కేెఎల్ రాహుల్ బలి అయ్యాడు. క్రిస్ వోక్స్ విసిరిన గుడ్ లెంగ్త్ బంతిని అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యాడు. ఎలా ఆడాలో తెలియక తికమక పడ్డాడు. ఆ గ్యాప్‌లో బంతి అతని బ్యాట్ ఎడ్జ్‌ను ముద్దాడి నేరుగా వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లో వాలింది. అప్పటికి జట్టు స్కోర్ 9 పరుగులే. అనంతరం విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకొచ్చాడు. తనదైన శైలిలో ఆడుతున్నాడు.

రోహిత్ సైతం..
రోహిత్ శర్మ కూడా త్వరగానే పెవలియన్ దారి పట్టాడు. ఎక్కువసేపు క్రీజ్‌లో ఉండలేకపోయాడు. 28 బంతుల్లో నాలుగే ఫోర్లు కొట్టిన ఈ హిట్ మ్యాన్ 27 పరుగులు చేశాడు. క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 9వ ఓవర్ అయిదో బంతికి భారీ షాట్ ఆడబోయాడు గానీ టైమింగ్ మిస్ అయ్యాడు. అది కాస్త లోయర్ బ్యాట్‌ను తాకిన బంతి లాంగాన్ దిశగా గాల్లోకి ఎగిరింది. అక్కడే పొంచివున్న సామ్ కుర్రన్ దీన్ని అద్భుతంగా అందుకున్నాడు. పక్షిలా గాల్లోకి ఎగిరి.. నేలకు తాకుందనుకున్న చివరి సెకెండ్‌లో బంతిని చేజిక్కించుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 56 పరుగులు.

నిరాశపరిచిన సూర్య..
నయా సూపర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ కూడా నిరాశపరిచాడు. తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆదిల్ రషీద్ విసిరిన స్లో లెగ్ బ్రేక్ బంతికి బలి అయ్యాడు సూర్య. ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా బంతిని స్వీప్ ఆడబోయి.. గాల్లోకి లేపాడు. డీప్ కవర్ పాయింట్‌లో ఉన్న ఫిల్ సాల్ట్ దాన్ని దొరకబుచ్చుకున్నాడు. దీనితో 75 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది టీమిండియా.

ఆదుకున్న కోహ్లీ..
ఈ పరిస్థితుల్లో ఉన్న టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. ఎప్పట్లాగే భారీ స్కోర్ సాధించాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో సరిగ్గా 50 పరుగులు చేశాడు. వికెట్లకు దూరంగా యార్కర్‌గా సంధించిన బంతిని భారీ షాట్ ఆడాడు కోహ్లీ. షార్ట్ థర్డ్ లెగ్ దిశగా గాల్లోకి లేచిన బంతిని ఆదిల్ రషీద్ అద్భుతంగా అందుకున్నాడు. కుడివైపు డైవ్ చేస్తూ దొరకబుచ్చుకున్నాడు. దీనితో కోహ్లీ ఇన్నింగ్‌కు తెర పడింది.

4,000 పరుగులు పూర్తి..
ఈ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకునే క్రమంలో విరాట్ కోహ్లీ మరో రికార్డును అందుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో 4,000 పరుగులను పూర్తి చేసుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. ఈ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు కోహ్లీ. ఆరు ఇన్నింగ్స్‌లల్లో 296 పరుగులు చేశాడు. 98.66 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 82 నాటౌట్. పాకిస్తాన్‌పై ఈ స్కోర్ చేశాడు కింగ్ కోహ్లీ.


Click it and Unblock the Notifications












