అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి భారత్-ఇంగ్లండ్ ఆఖరి టెస్టు ఆడనుంది. ఇప్పటికే సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా జరగనున్న ఆఖరి టెస్టు నామమాత్రమైనప్పటికీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి ఇరుజట్లకు ఇది కీలకమే కానుంది.
కాగా, ధర్మశాల టెస్టు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఎంతో స్పెషల్ కానుంది. తన కెరీర్‌లో 100వ టెస్టుకు ప్రతీకగా ధర్మశాల నిలవనుంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ జ్ఞాపకాలను అశ్విన్ పంచుకున్నాడు. 100వ టెస్టు తనకు గొప్ప పండుగని అశ్విన్ పేర్కొన్నాడు. 2012 ఇంగ్లండ్ టెస్టు సిరీస్ తన కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా మారిందని చెప్పాడు.

''2012లో స్వదేశంలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో కుక్, పీటర్సన్ భారీ స్కోరులు సాధించారు. ఆ సమయంలో జట్టులో నుంచి నన్ను తప్పించాలనే చర్చలు సాగాయి. అది నాకు టర్నింగ్ పాయింట్‌గా చెప్పవచ్చు. అది నాకో గుణపాఠంగా మారింది. నా ఆటను మరో అయిదు శాతం మెరుగుపర్చుకోవడానికి కారణమైంది. నా ఆటలో సరిదిద్దుకోవాల్సిన లోపాలు తెలిశాయి. అప్పటి నుంచి నా ఆటను పరీక్షించుకుంటూ ముందుకు సాగాను'' అని అశ్విన్ పేర్కొన్నాడు.
2012లో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. నిర్ణయాత్మక ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అలిస్టర్ కుక్ 190 పరుగులు చేశాడు. రెండో టెస్టులో పీటర్సన్ 186 పరుగులు సాధించి ఇంగ్లండ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో భారత స్పిన్నర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఏకంగా 737 పరుగులు ఇచ్చారు.
అయితే అశ్విన్ సిరీస్‌లో ఫర్వాలేదనిపించాడు. అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా సిరీస్‌లో నిలిచాడు. బ్యాటుతోనూ ఫర్వాలేదనిపించాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు సాధించాడు. ఈ సిరీస్ అనంతరం తన ఆటను మరింత మెరుగుపర్చుకున్నాని అశ్విన్ తెలిపాడు. కాగా, టెస్టుల్లో అశ్విన్ ఇటీవల 500 వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్ అశ్విన్. అంతకుముందు అనిల్ కుంబ్లే 500 వికెట్లు మార్క్‌ను అందుకున్నాడు.