టెస్టు చరిత్రలో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో నెగ్గి ఈ ఘనత సాధించింది. 577 టెస్టుల చరిత్రలో.. పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత భారీ విజయం. ఈ క్రమంలో అయిదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది.
మరోవైపు పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు ఇది అత్యంత ఘోర పరాజయాల్లో ఇది రెండోది. 1934లో ఆస్ట్రేలియా చేతిలో 562 పరుగుల తేడాతో ఓటమి అనంతరం ఇంగ్లండ్‌కు ఇదే అతి పెద్ద ఓటమి. అంతేగాక బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో వరుసగా రెండు టెస్టులు ఓడటం ఇది రెండో సారి. గతేడాది ఆస్ట్రేలియాతో ఎడ్గబాస్టన్, లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టుల్లో స్టోక్స్ సేన వరుసగా ఓడింది. ఇప్పుడు వైజాగ్‌తో పాటు రాజ్‌కోట్ టెస్టుల్లో పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఓటమి గల కారణాలను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వివరించాడు. కొన్నిసార్లు ప్రత్యర్థిపై రచించిన వ్యూహాలు ఫలించవని, ఇప్పుడు అదే జరిగిందని పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో తమ ఆటగాళ్ల అభిప్రాయాలను తీసుకుని ఓటమి గురించి విశ్లేషించుకుంటామని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (153; 151 బంతుల్లో) ఆటను కొనియాడాడు. మిగిలిన టెస్టుల్లో గెలిచి సిరీస్ సాధించడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు.
''నమ్మశక్యం కానీ ఇన్నింగ్స్‌ను బెన్ డకెట్ ఆడాడు. అలాంటి ఆట ఆడుతూ మా ఇన్నింగ్స్ మొత్తాన్ని నిర్మించాలని భావించాం. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరుకు దగ్గరగా వచ్చాం. అవకాశాలను ఉపయోగించుకుని స్కోరుబోర్డును ముందుకు నడిపించాం. శనివారం బౌలింగ్ చేయాలనుకున్నాం. అంత తొందరగా ఫీల్డింగ్‌కు వస్తామనుకోలేదు (ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆలౌట్ గురించి)''
''కొన్ని గేమ్ ప్లాన్స్ వర్కౌట్ కావు. ఇక్కడ అదే జరిగింది. దీని గురించి జట్టులోని ఆటగాళ్లు అభిప్రాయాలను, ఆలోచనలను తీసుకుంటాం. ప్రస్తుతం 1-2తో సిరీస్‌లో వెనుకబడ్డాం. గొప్పగా పుంజుకుని సిరీస్‌ను గెలిచే అవకాశం మాకు దక్కింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని వదిలేసి, తర్వాత రెండు టెస్టుల గురించి దృష్టిసారిస్తాం'' అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.
557 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఛేదనలో 122 పరుగులకే కుప్పకూలింది. జడేజా అయిదు వికెట్లతో సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌటైంది. అయితే 224/2తో మెరుగైన స్థితిలో ఉన్న ఇంగ్లండ్ చివరి ఎనిమిది వికెట్లు 95 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 430/4 వద్ద డిక్లేర్ చేసింది. యశస్వీ జైస్వాల్ (214*), శుభ్‌మన్ గిల్ (91), సర్ఫరాజ్ ఖాన్ (68*) అదరగొట్టారు.