IND vs ENG:టీమిండియాకి గెలిచే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి.. చేయాల్సింది అదొక్కటే: మైకేల్ వాన్

లండన్: లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకి గెలిచే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయని ఇంగ్లీష్ మాజీ కెప్టెన్, స్టార్ కామెంటేటర్ మైకేల్ వాన్ అన్నాడు. విజయం సాధించాలంటే ఆధిక్యం చాలానే ఉన్నా.. హెడింగ్లే మైదానంలో అద్భుతాలు జరుగవచ్చని వాన్ అభిప్రాయపడ్డాడు. భారత్ విజయం అందుకోవాలంటే.. నాలుగో రోజు మొదటి సెషన్‌లో జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ఆటతీరు కనబర్చిన భారత బ్యాట్స్‌మెన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లను మెరుగ్గా ఎదుర్కొన్నారు. ఫలితంగా మూడో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

మొదటి సెషన్‌లో ఆడితే:
మూడో రోజు మ్యాచ్ అనంతరం మైకేల్ వాన్ మాట్లాడుతూ... 'హెడింగ్లే మైదానంలో ఉదయం మంచు కురుస్తుంది. కాబట్టి పిచ్ మందకోడిగా ఉండటంతో పాటు బంతి గింగిరాలు తిరుగుతుంది. దీంతో నాలుగో రోజు భారత బ్యాట్స్‌మెన్ మొదటి సెషన్‌లో కొద్దిసేపు ఇబ్బంది పడవచ్చు. అలానే ఇంగ్లండ్ జట్టుకు వికెట్లు తీసేందుకు కూడా ఇదే అనువైన సమయం. భారత్ మొదటి సెషన్‌లో వికెట్లు కోల్పోకుండా ఆడితే.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. అందుకే మొదటి సెషన్ ఆట ఇరు జట్లకు చాలా కీలకం కానుంది. మొదటి సెషన్‌లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తే.. వారిదే దాదాపు మ్యాచ్' అని అభిప్రాయపడ్డాడు.

అద్భుతాలు జరగవచ్చు:
'రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నా.. భారత్ ఇంకా చాలా వెనుకబడి ఉంది. కానీ మూడో రోజు ఉదయం సెషన్‌లో వారు కేవలం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి అద్భుతంగా రాణించారు. గతంలో ఇదే వేదికపై భారత్ 4 వికెట్లు కోల్పోయినా.. విజయం సాధించింది. ప్రస్తుతం భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. అందుకే ఈ మ్యాచ్‌లో అద్భుతాలు జరుగవచ్చనిపిస్తోంది. టీమిండియా విజయం సాధించినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ జట్టులో మంచి ప్లేయర్స్ ఉన్నారు. సీనియర్లు సరైన సమయంలో జట్టును ఆదుకోగలరు. బౌలర్లు మంచి లయ అందుకున్నారు. రెండో టెస్టులో వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు' అని మైకేల్ వాన్ గుర్తుచేసుకున్నాడు.

రూట్ వ్యూహాలు బాగున్నాయి:
మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అనుసరించిన వ్యూహాలను కామెంటేటర్ మైకేల్ వాన్ ప్రశంసించాడు. ఫాస్ట్ బౌలర్లకు వెలుతురు సహకరించకపోవడంతో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం, కొత్త బంతితో వికెట్లు తీసేందుకు ప్రయత్నించడం వంటి ఎత్తుగడలను హైలెట్ చేశాడు. భారత ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేందుకు పదేపదే బౌలర్లను మార్చిన విధానం బాగుందన్నాడు. మొత్తానికి రూట్ నాయకత్వం చాలా మెరుగైందని వాన్ చెప్పుకొచ్చాడు. మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ 139 పరుగులు వెనుకబడి ఉంది. ఇంకా 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. చేతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 91), విరాట్ కోహ్లీ (94 బంతుల్లో 45) క్రీజులో ఉన్నారు.

సముద్రంలో మునిగిన నావలా:
భారత తొలి ఇన్నింగ్స్ అనంతరం మైఖేల్ వాన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'చేతేశ్వర్ పుజారా తన ఆట తీరును పూర్తిగా మరిచిపోయాడు. సముద్రంలో మునిగిన నావలా అన్న చందంగా పుజారా పరిస్థితి తయారైంది. అతనికి మైండ్ పోవడంతో పాటు తన మార్క్ టెక్నిక్ షాట్లను కూడా మరిచిపోయాడు. ఆటలో స్కోరు నమోదు చేయడం కంటే.. మ్యాచ్‌లో నిలవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆ ఒత్తిడిలో కూరుకుపోయి అతను తేలిగ్గా వికెట్ ఇచ్చేస్తున్నాడు' అని తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.

ఏ భారత బ్యాట్స్‌మెన్ ఆదుకుంటాడో:
2019లో ఆస్ట్రేలియాస్‌తో ఇక్కడే జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అద్భుతంగా రాణించి జట్టుకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. 219 బంతుల్లో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అది గొప్ప ఛేదనల్లో ఒకటిగా చరిత్రలో మిగిలిపోయింది. గతంలో మరో దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఇయాన్ బోథమ్ కూడా ఇదే పిచ్‌లో 149 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మరి ప్రస్తుత టెస్టులో ఏ భారత బ్యాట్స్‌మెన్ జట్టును ఆదుకుంటాడో చూడాలి. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఎంతో ఉంది.

కోల్‌కతా టెస్టు తరహాలో పోరాడాలి:
2001 కోల్‌కతా టెస్టు తరహాలో అద్భుత పోరాట పటిమ ప్రదర్శించిన భారత్ శనివారం కూడా ఇదే జోరు కొనసాగిస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. శుక్రవారం 80 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 215 పరుగులు చేసిన కోహ్లీ సేన నాలుగో రోజూ ఇదే ఆటతీరు కనబరిస్తే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటేయడంతో పాటు ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిలపవచ్చు. ప్రస్తుతానికి ఓపెనర్లు పెవిలియన్ చేరిపోగా.. విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా తర్వాత అజింక్యా రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు రానున్నారు. పుజారా వీలైనంత ఎక్కువసేపు క్రీజులో నిలిస్తేనే భారత్ ఈ మ్యాచ్‌ను కాపాడుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కోహ్లీ, పుజారా, రహానే రెండు సెషన్‌ల పాటు ఇంగ్లిష్ బౌలర్లను అడ్డుకోగలిగితే.. పంత్, జడేజా ప్రత్యర్థికి మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించే చాన్స్ ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications