చమటోడ్చుతున్న కోహ్లీసేన:
లార్డ్స్ టెస్ట్ గత సోమవారం ముగిసింది. మూడో టెస్టుకు మధ్యలో వారంకు పైగా సమయం ఉండడంతో భరత ఆటగాళ్లు తమతమ కుటుంబాలతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. మూడో టెస్ట్ కోసం ఆందరూ కలిసి ఆదివారం ఉదయమే లీడ్స్ చేరుకొని.. సాయంత్రం హెడింగ్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ లోకేష్ రాహుల్. వైస్ కెప్టెన్ అజింక్య రహానేలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో చమటోడ్చాడు. పేసర్లు మొహ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు బౌలింగ్ సాధన చేశారు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌కు సంబందించిన కసరత్తులు చేయగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్యాచులు ప్రాక్టీస్ చేశాడు. టీమిండియా సాధనకు సంబందించిన ఫొటోలను బీసీసీఐ తన అధికార ట్విట్టర్ ఖాతాలో ఉంచింది.
అశ్విన్ ఇన్:
లార్డ్స్ టెస్ట్ విజయంతో 1-0తో ఆధిక్యంలో వెళ్లిన కోహ్లీసేన మూడో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్‌పై మరింత పట్టు సాధించాలని చూస్తోంది. విజయ ఉత్సాహంలో ఉన్న భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి రానున్నాడు. వాతావరణ పరిస్థితులు, రవీంద్ర జడేజా బ్యాటింగ్ సామర్థ్యం తొలి రెండు టెస్టులకు అశ్విన్‌ను పక్కనపెట్టేలా చేశాయి. కానీ జడేజా అంచనాలను అందుకోలేదు. తొలి టెస్ట్‌లో 16 ఓవర్లు వేసిన జడేజా ఒక్క వికెట్ తీయకపోగా.. 3.30 చోప్పున పరుగులు ఇచ్చాడు. ఇక రెండో టెస్ట్‌లో 28 ఓవర్లు వేసిన జడ్డు ఒక్క వికెట్ కూడా తీయలేదు. 48 పరుగులిచ్చాడు. దీంతో యాష్ రాక ఖాయంగా కనిపిస్తోంది.

ఇషాంత్ స్థానంలో శార్దూల్:
విదేశీ గడ్డలపై నలుగురు పేసర్లు, ఏకైక స్పిన్నర్ రూల్‌తో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇదే ఫార్ములాకు కోహ్లీ కట్టుబడితే.. రవీంద్ర జడేజా స్థానంలో ఆర్ అశ్విన్‌కు అవకాశం దక్కవచ్చు. ఇషాంత్ శర్మ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. అయితే శార్దూల్ తొడ కండరాల గాయం నయమైతే ఈ మార్పు జరగనుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి ఫామ్ మీదున్నారు. విమర్శలపాలైన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు కూడా గాడిలో పడ్డారు. ఇక విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా పరుగులు చేస్తే.. భారత బ్యాటింగ్‌కు ఎదురేఉండదు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

భారత తుది జట్టు (అంచనా):
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ/శార్దూల్ ఠాకూర్.


Click it and Unblock the Notifications
