ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 124.1 ఓవర్లకు 477 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఇవాళ మరో నాలుగు పరుగులు మాత్రమే సాధించింది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో కుల్‌దీప్ (30; 69 బంతుల్లో) షాట్‌కు యత్నించి వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతికి చిక్కాడు. కుల్‌దీప్ వికెట్‌తో అండర్సన్ టెస్టుల్లో 700 వికెట్ల మార్క్‌ను సాధించాడు.
తర్వాతి ఓవర్‌లోనే జస్ప్రీత్ బుమ్రా (20; 64 బంతుల్లో) ఔటయ్యాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. టీమిండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (110; 150 బంతుల్లో), రోహిత్ శర్మ (103; 162 బంతుల్లో) శతకాలతో కదంతొక్కారు. దేవదత్ పడిక్కల్ (65; 103 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (57; 58 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (56; 60 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు.

అయితే 403/4తో పటిష్టస్థితిలో నిలిచిన టీమిండియా అనూహ్యంగా వరుసగా వికెట్లు చేజార్చుకుంది. 25 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. పడికల్, ధ్రువ్ జురెల్ (15; 24 బంతుల్లో), రవీంద్ర జడేజా (15; 50 బంతుల్లో), రవిచంద్రన్ అశ్విన్ (0) వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రాతో కలిసి కుల్‌దీప్ యాదవ్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. తొమ్మిదో వికెట్‌కు వీరిద్దరు 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. జేమ్స్ అండర్సన్, టామ్ హర్ట్‌లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బెన్ స్టోక్స్ ఒక్క వికెట్ తీశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కుల్‌దీప్ యాదవ్ అయిదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే (79; 108 బంతుల్లో) టాప్ స్కోరర్. రెండో అత్యధిక స్కోరు బెయిర్‌స్టో చేసిన 29 పరుగులు (18 బంతుల్లో).