ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. 135/1తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ దూకుడుగా పరుగులు సాధిస్తోంది. రోహిత్ శర్మ (91*; 140 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (86*; 125 బంతుల్లో) ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కులు చూపిస్తున్నారు.
రోహిత్ సంయమనంతో ఆడుతుంటే.. గిల్ మాత్రం చెలరేగుతున్నాడు. స్పిన్నర్లు, పేసర్లు తేడాలేకుండా బౌండరీల మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధశతకం సాధించాడు. 78 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అండర్సన్, మార్క్ వుడ్ బౌలింగ్‌లో గిల్ స్టైలిష్ షాట్లతో ప్రత్యేకంగా విరుచుకుపడ్డాడు.

34వ ఓవర్ వేసిన అండర్సన్ బౌలింగ్‌లో కళ్లుచెదిరే సిక్సర్ బాదాడు. అండర్సన్‌ను ఓ స్పిన్నర్‌లా ఎదుర్కొన్నాడు. 131 kmph వేగంతో వచ్చిన బంతిని ముందుకు వచ్చి స్ట్రైట్ డౌన్ ది గ్రౌండ్ మీదుగా స్టాండ్స్‌కు తరలించాడు. అదే ఓవర్‌లో సొగసైన బౌండరీ బాదాడు. గిల్ దూకుడుకు ఆ ఓవర్‌లో ఏకంగా 14 పరుగులు వచ్చాయి.
అనంతరం మార్క్ వుడ్ బౌలింగ్‌లో గిల్ ఓవర్‌కు రెండు బౌండరీల చొప్పున బాదాడు. ఫీల్డర్ల మధ్య లెక్కకట్టి క్లాసిక్ బౌండరీలు బాదుతున్నాడు. స్పిన్నర్లపై భారీ సిక్సర్లతో విజృంభిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత్ ఇంగ్లండ్ స్కోరును అధిగమించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రోహిత్, గిల్ శతకాల దిశగా సాగుతున్నారు. వారిద్దరి సెంచరీలతో కదం తొక్కి భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే ఆఖరి టెస్టులో టీమిండియా రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చే అవసరం కూడా ఉండదు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కుల్‌దీప్ యాదవ్ అయిదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే (79; 108 బంతుల్లో) టాప్ స్కోరర్. రెండో అత్యధిక స్కోరు బెయిర్‌స్టో చేసిన 29 పరుగులు (18 బంతుల్లో). అనంతరం గురువారమే తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు శుభారంభం లభించింది.
యశస్వీ జైస్వాల్ (57; 58 బంతుల్లో)తో కలిసి రోహిత్ శర్మ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. అయితే హాఫ్‌సెంచరీ సాధించిన అనంతరం జైస్వాల్ ఔటయ్యాడు. 135/1తో భారత్ తొలి రోజు ఆటను ముగించింది. ప్రస్తుతం 54 ఓవర్లకు టీమిండియా 241/1తో నిలిచింది.