రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇంగ్లండ్‌కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 196/2తో ఇవాళ ఆటను ఆరంభించిన టీమిండియా నాలుగు వికెట్లకు 430 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వీ జైస్వాల్ (214*; 236 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (91; 154 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (68*; 72 బంతుల్లో) సత్తాచాటారు.
తన కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న సర్ఫరాజ్ సాధికారికంగా ఆడాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా సర్ఫరాజ్ అర్ధశతకం సాధించిన విషయం తెలిసిందే. 66 బంతుల్లో 62 పరుగులు చేసిన అతడు రనౌటయ్యాడు.

అయితే సర్ఫరాజ్ అరుదైన రికార్డు నమోదుచేశాడు. అరంగేట్ర టెస్టులో భారత్ తరఫున రెండు వరుస హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సర్ఫరాజ్ కంటే ముందు ఈ ఘనతను దిలావర్ హుస్సేన్ (59 & 57 ఇంగ్లండ్‌పై 1934లో), సునీల్ గవాస్కర్ (65 & 67* వెస్టిండీస్‌పై 1971లో), శ్రేయస్ అయ్యర్ (105 & 65 న్యూజిలాండ్‌పై 2021లో) మాత్రమే సాధించారు.
కాగా, ఆదివారం ఆటను భారత్ ఆచితూచి ప్రారంభించింది. నైట్‌వాచ్‌మన్ కుల్‌దీప్ యాదవ్ కుల్‌దీప్ యాదవ్ (27; 91 బంతుల్లో)తో కలిసి గిల్ స్కోరుబోర్డు నడిపించాడు. చెత్తబంతుల్ని బౌండరీకి తరలిస్తూ వీరిద్దరు పరుగులు సాధించారు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న గిల్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. కుల్‌దీప్ అనవసరపు పరుగుకు ప్రయత్నించి నో చెప్పడంతో గిల్ వెనుదిరిగాడు. కాసేపటికే కుల్‌దీప్ కూడా ఔటయ్యాడు.
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశారు. అయిదో వికెట్‌కు అజేయంగా 172 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జైస్వాల్ 231 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, జో రూట్, టామ్ హర్ట్‌లీ తలో వికెట్ తీశారు. రోహిత్ శర్మ (19) పరుగులు చేశాడు.
అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ టీ విరామానికి 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. గత ఇన్నింగ్స్ హీరో బెన్ డకెట్ (4) రనౌటయ్యాడు. మరో ఓపెనర్ క్రాలే (11)ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 539 పరుగులు చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445, ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది.