దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదగా టీమిండియా టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు.
ఈ క్షణంలో మైదానంలోనే ఉన్న సర్ఫరాజ్ ఫ్యామిలీ భావోద్వేగానికి గురయ్యారు. క్యాప్‌ను అందుకున్న అనంతరం సర్ఫరాజ్ తన ఫ్యామిలీ దగ్గరకు వెళ్లాడు. తన తండ్రి నౌషద్ ఖాన్, తన భార్య రోమన జహూర్‌ను కలుసుకుని కల నెరవేరిందంటూ తన క్యాప్‌ను చూపించాడు. ఆ క్షణంలో వాళ్లంతా కన్నీటినీ ఆపుకోలేకపోయారు. తన తండ్రి నౌషద్ ఖాన్.. సర్ఫరాజ్‌ను కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యాడు.

దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తుదిజట్టులో సర్ఫరాజ్ చోటు దక్కించుకోవడంతో అతడి పేరు ట్విటర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ అసాధారణ ప్రదర్శన చేస్తున్నాడు. సెంచరీల మోత మోగిస్తున్నాడు. తన పరుగుల వరదకు అతడు ఇప్పటికే టీమిండియాలో చోటు దక్కించుకుని ఉండాలి. కానీ ఫిట్‌నెస్, ఇతర కారణాలతో అతడిని సెలక్టర్లు పక్కనపెట్టారు. ఎట్టకేలకు భారత్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. కాగా, సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున సత్తాచాటిన విషయం తెలిసిందే.
సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా ఇవాళ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. వైజాగ్‌కు చెందిన కేఎస్ భరత్ స్థానంలో యూపీ కుర్రాడు ధ్రువ్ అవకాశం సాధించుకున్నాడు. వికెట్ల వెనుక సత్తాచాటుతున్నా బ్యాటింగ్‌లో విఫలమవ్వడంతో భరత్‌ను పక్కనపెట్టారు. మరోవైపు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ రాకతో అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తమ స్థానాల్ని కోల్పోయారు.
భారత తుది జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్ తుది జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.