రోహిత్ శర్మ చేతికి గాయం - సెమీ ఫైనల్స్‌కు ముందు తీవ్ర ఆందోళన..!!

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సెమీ ఫైనల్స్‌కు ముహూర్తం ముంచుకొస్తోంది. ఇంకొన్ని గంటల్లో తొలి సెమీ ఫైనల్ ఆరంభం కాబోతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఇందులో న్యూజిలాండ్-పాకిస్తాన్ తలపడబోతోన్నాయి. ఈ మెగా ఈవెంట్ సెమీ ఫైనల్స్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన బ్లాక్ క్యాప్స్‌తో ఢీ కొట్టబోతోంది పాకిస్తాన్.

ఎల్లుండే..
ఆ మరుసటి రోజే- రెండో సెమీ ఫైనల్ షెడ్యూల్ అయింది. భారత జట్టును ఎదుర్కొనబోతోంది ఇంగ్లాండ్. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు కూడా అడిలైడ్ చేరుకున్నాయి. నెట్ ప్రాక్టీస్‌లో తలమునకలయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు- ఈ నెల 13వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగే ఫైనల్‌లో అడుగు పెడుతుంది. న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌తో తలపడుతుంది.

క్యాంప్‌లో కలకలం..
ఇంగ్లాండ్ సెమీ ఫైనల్స్ కోసం సమాయాత్తమౌతోన్న భారత క్యాంప్‌లో కలకలం చెలరేగింది. రథ సారథి రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తోండగా.. టీమిండియా థ్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు చేతి నుంచి వెలువడిన బంతి వేగంగా అతని కుడి చేతిని బలంగా తాకింది. దీనితో హిట్ మ్యాన్ నొప్పితో విలవిల్లాడాడు. నెట్స్ నుంచి బయటికొచ్చాడు. కొద్దిసేపు అక్కడే కూర్చుండి పోయాడు.

బంతి తగిలిన చోట వాపు..
దీన్ని చూసిన వెంటనే ఫిజియోథెరపిస్ట్ రోహిత్ శర్మ వద్దకు చేరుకున్నాడు. దెబ్బ తగిలిన చోట ఐస్ బ్యాగ్‌ను అమర్చారు. పెయిన్ కిల్లర్‌ను ఇచ్చారు. మెంటల్ కోచ్ ప్యాడీ అప్టాన్, మెడికల్ స్టాఫ్, ఇతర సపోర్టింగ్ సిబ్బంది మొత్తం కూడా రోహిత్ శర్మ వద్దకు చేరుకున్నారు. గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది వెంటనే తెలియరాలేదు. బంతి తగిలిన చోట కండరం వాచినట్లు కొన్ని స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొన్నాయి.

అభిమానుల్లో ఆందోళన..
ఈ పరిణామం జట్టులో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. సెమీ ఫైనల్స్ ముంగిట్లో రోహిత్ శర్మ చేతికి గాయం కావడం అటు అభిమానులనూ కలవరపాటుకు గురి చేసింది. రోహిత్ శర్మే గాయం బారిన పడితే- సెమీ ఫైనల్స్ రిజల్ట్ ఎలా ఉంటుందోననే ఆందోళన అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అది ఎంతో సేపు నిలవలేదు. కొంత విరామం తరువాత రోహిత్ శర్మ మళ్లీ నెట్ ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్‌కు హాజరయ్యాడు. నొప్పితో కొంత ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేస్తూ కనపించాడు.

చిన్న జట్ల పంజా..
సూపర్ 12 సంచలనాలతో ముగిసింది. చిన్నజట్లు చెలరేగాయి. గ్రూప్స్ దశ నుంచే ప్రధాన జట్లను మట్టి కరిపిస్తూ వచ్చాయి. గ్రూప్స్‌లో తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకను ఓడించింది నమీబియా. అక్కడ మొదలైన వాటి ప్రస్థానం- సూపర్ 12 ముగింపు రోజు వరకూ కొనసాగింది. నెదర్లాండ్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసే స్థాయికి చేరుకుంది. టైటిల్ హాట్ ఫేవరెట్లల్లో ఒకటైన దక్షిణాఫ్రికా- సెమీ ఫైనల్స్ ముంగిట్లో బొక్క బోర్లా పడాల్సి వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications