రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (131; 196 బంతుల్లో), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (100*; 198 బంతుల్లో) శతకాలతో కదం తొక్కారు. అయితే ఓ దశలో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నారనే ఫీలింగ్ అభిమానుల్లో కలిగింది. అంతలా ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగారు.
తొమ్మిది ఓవర్లలోపే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ (10; 10 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (డకౌట్; 9 బంతుల్లో), రజత్ పటిదార్ (5; 15 బంతుల్లో) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. తొలుత ఆచితూచి ఆడిన ఈ జోడి తర్వాత గేర్ మార్చి దూకుడుగా ఆడారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

22 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం సాధించిన భారత జోడీ ఇదే కావడం విశేషం. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌పై నాలుగో వికెట్‌కు ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం. 2002లో సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ సాధించిన 249 పరుగులు అత్యధికం. ఆ తర్వాత స్థానంలో 1952లో విజయ్ మంజ్రేకర్-విజయ్ హజారే నెలకొల్పిన 222 పరుగుల భాగస్వామ్యం ఉంది.
రాజ్‌కోట్‌లో రోహిత్ శర్మ-రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌పై 22 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టడంతో RRR రికార్డు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా అందరికీ సుపరిచితమే. కాగా, 71 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ 157 బంతుల్లో శతకం బాదాడు. మరోవైపు రవీంద్ర జడేజా 97 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. అయితే సెంచరీకి చేరువుతున్న జడ్డూకి తోడుగా నిలిచిన సర్ఫరాజ్ (62; 66 బంతుల్లో) రనౌటయ్యాడు. జడ్డూ సమన్వయలోపంతో అరంగేట్ర ప్లేయర్ పెవిలియన్‌కు చేరాడు.