
మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా గురువారం భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇంగ్లాండ్‌తో జరిగే పోరు ఇది. ఈ రెండు జట్లు కూడా ఫైనల్ మ్యాచ్‌పై కన్నేశాయి. సెమీస్‌లో విజయం సాధించడానికి చెమటోడుస్తోన్నాయి. నెట్స్‌లో శ్రమిస్తోన్నాయి. గెలిచిన జట్టు- ఇవ్వాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి సెమీ ఫైనల్ విజేతతో ఈ నెల 13వ తేదీన ఫైనల్‌లో తలపడుతుంది.
ఈ నేపథ్యంలో- టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ విలేకరులతో మాట్లాడాడు. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించాడు. తుదిజట్టు గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. సెమీ ఫైనల్ ఆడే జట్టులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే- దినేష్ కార్తీక్, రిషభ్ పంత్ ఇద్దరినీ ఆడించే అవకాశాలు లేకపోలేదని వ్యాఖ్యానించాడు. ఒకట్రెండు మ్యాచ్‌లను ఆధారంగా చేసుకుని ప్లేయర్ ప్రతిభను అంచనా వేయడం సరికాదని స్పష్టం చేశాడు.
రిషభ్ పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరూ సక్సెస్ కాలేకపోయారనే విషయాన్ని రోహిత్ శర్మ గుర్తు చేశాడు. సెమీస్ అయినా లేదా ఇతర ఏ గేమ్ ఆడినా అందరూ సిద్ధంగా ఉండాలనే తాము ప్లేయర్లకు చెబుతుంటామని, ఇప్పుడూ అదే జరిగిందని వ్యాఖ్యానించాడు. జింబాబ్వే లెఫ్ట్ హ్యాండర్‌కు అవకాశం ఇవ్వాలని తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశాడు. రేపు ఏమి జరగబోతోందో తెలియదని, వికెట్ కీపర్లు ఇద్దరికీ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉందని వివరించాడు. తన వ్యక్తిగత అభిప్రాయం కూడా అదేనని తేల్చేశాడు రోహిత్ శర్మ.
సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని రోహిత్ శర్మ కితాబిచ్చాడు. ఈ టోర్నమెంట్‌లో అతను నిలకడగా రాణిస్తోన్నాడని, పిచ్ ఎలాంటిదైనా భారీ షాట్లను ఆడటానికే అతను ఇష్టపడుతున్నాడని పేర్కొన్నాడు. బౌలర్లపై దూకుడుగా ఆడటం అతని నైజమని, క్రీజ్‌లో స్వేచ్ఛగా కదులుతుండటం అతనికి అదనపు బలమని వ్యాఖ్యానించాడు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో పరిణితి వచ్చిందని, మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడిని చాలావరకు తగ్గించాడనీ చెప్పుకొచ్చాడు.