రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు అంపైర్ జోయెల్ విల్సన్ పెనాల్టీ విధించాడు. అయిదు పరుగుల పెనాల్టీగా పేర్కొన్నాడు. దీంతో ఇంగ్లండ్ బాల్‌ను ఎదుర్కోకముందే తమ తొలి ఇన్నింగ్స్‌ను 5/0తో ప్రారంభించనుంది. అసలేం జరిగిదంటే..
మిడిల్ పిచ్ మీద పరిగెడుతున్నాడని పేర్కొంటూ రవిచంద్రన్ అశ్విన్‌కు అంపైర్ జోయోల్ విల్సన్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేగాక అయిదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో అంపైర్‌తో అశ్విన్ వాగ్వాదానికి దిగాడు. పెనాల్టీ సరైన కారణం వివరించాలని అడిగాడు. అంపైర్‌తో కాసేపు అశ్విన్ చర్చించాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఆటగాళ్లకు అంపైర్ తొలుత వార్నింగ్ ఇస్తారు. మరోసారి అదే పరిస్థితి ఎదురైతే పెనాల్టీ విధిస్తారు. ఈ విషయం గురించి అంపైర్‌తో అశ్విన్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

అయితే తొలి రోజు ఆటలో రవీంద్ర జడేజాను అంపైర్లు ఇదే కారణంతో మందలించారు. మిడిల్ పిచ్ మీద పరుగు తీస్తున్నావంటూ హెచ్చరించారు. ఇవాళ ఆటలో అశ్విన్ కూడా అదే పని చేయడంతో జట్టుగా పరిగణించి అంపైర్లు పెనాల్టీ విధిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఓవర్‌నైట్ స్కోరు 326/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. 110 ఓవర్లకు 380/7తో నిలిచింది.
అయితే శుక్రవారం ఆట ప్రారంభమైన కాసేపటికే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన కుల్‌దీప్ యాదవ్ (4; 24 బంతుల్లో)ను జేమ్స్ అండర్సన్ ఔట్ చేశాడు. తర్వాత ఓవర్‌లో సెంచరీ హీరో రవీంద్ర జడేజా (112; 225 బంతుల్లో)ను జో రూట్ బోల్తాకొట్టించాడు.
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అరంగేట్ర ప్లేయర్ ధ్రువ్ జురెల్ (25*; 59 బంతుల్లో)తో కలిసి రవిచంద్రన్ అశ్విన్ (24*; 58 బంతుల్లో) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. తొలి టెస్టు ఆడుతున్న ధ్రువ్ జురెల్ సమర్థవంతంగా ఢిపెన్స్ ఆడుతున్నాడు. ఎలాంటి తడబాటు లేకుండా కచ్చితత్వంతో షాట్లు ఆడుతున్నాడు.
కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు పేలవ ఆరంభం లభించిన విషయం తెలిసిందే. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ (131; 196 బంతుల్లో), రవీంద్ర జడేజా గొప్పగా పోరాడి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్ 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
రోహిత్ ఔటైన అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అరంగేట్ర ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ (62; 66 బంతుల్లో) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వన్డే తరహాలో బౌండరీల మోత మోగించాడు. కానీ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. జడేజా అనవసరపు పరుగుకు ప్రయత్నించి సర్ఫరాజ్‌ను రనౌట్ చేశాడు. కాగా, జైస్వాల్ (10), రజత్ పటిదార్ (5), గిల్ (0) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లు, టామ్ హర్ట్‌లీ, అండర్సన్, జో రూట్ తలో వికెట్ తీశారు.