ధర్మశాలలో తన 100వ టెస్టు ఆడుతున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మాయజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. అశ్విన్ గింగరాలు తిప్పుతూ సంధిస్తున్న బంతులకు ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కడుతున్నారు. యాష్ ధాటికి ఇంగ్లండ్ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ కంటే ఇంగ్లండ్ 223 పరుగుల వెనుకుంజలో ఉంది.
బుమ్రాతో కలిసి కొత్తబంతిని పంచుకున్న అశ్విన్ తన తొలి ఓవర్‌లోనే ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. దూకుడుగా ఆడాలని క్రీజును వదలి ముందుకు వచ్చిన ఓపెనర్ బెన్ డకెట్ (2; 5 బంతుల్లో) క్లీన్‌బౌల్డ్ చేశాడు. కాసేపటికే మరో ఓపెనర్ జాక్ క్రాలే (1; 16 బంతుల్లో) పెవిలియన్‌కు చేర్చాడు. డిఫెన్స్‌కు ట్రై చేసిన క్రాలే షార్ట్‌లెగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ చేతికి చిక్కాడు.

ఆ తర్వాత ఒలీ పోప్ (19; 23 బంతుల్లో)ను అశ్విన్ ఔట్ చేశాడు. భారీషాట్‌కు ప్రయత్నించిన పోప్ జైస్వాల్‌కు దొరికిపోయాడు. జైస్వాల్ రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 124.1 ఓవర్లకు 477 పరుగులు చేసి ఆలౌటైంది. 259 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
ఓవర్‌నైట్ స్కోరు 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఇవాళ మరో నాలుగు పరుగులు మాత్రమే సాధించింది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో కుల్‌దీప్ (30; 69 బంతుల్లో) షాట్‌కు యత్నించి వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్‌లోనే జస్ప్రీత్ బుమ్రా (20; 64 బంతుల్లో) ఔటయ్యాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.
టీమిండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (110; 150 బంతుల్లో), రోహిత్ శర్మ (103; 162 బంతుల్లో) శతకాలతో కదంతొక్కారు. దేవదత్ పడిక్కల్ (65; 103 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (57; 58 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (56; 60 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. జేమ్స్ అండర్సన్, టామ్ హర్ట్‌లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బెన్ స్టోక్స్ ఒక్క వికెట్ తీశాడు.