IND vs ENG: 'ఆస్ట్రేలియా మాదిరే భారత్ ఆడుతోంది.. ఇలా చెప్పడం కాస్త కష్టంగానే ఉంది'

ఓవల్: మైదానంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడిన (స్లెడ్జింగ్) మాదిరిగానే ప్రస్తుతం భారత్ ఆడుతోందని ఇంగ్లండ్ సహాయక కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ అన్నాడు. మైదానంలో ఆసీస్ ప్లేయర్స్ మాటలతో ప్రత్యర్థులను దెబ్బతీస్తారని, ఇప్పుడు భారత్ ఆ దారినే అనుసరిస్తోందన్నాడు. మూడో టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్ తర్వాతి మ్యాచ్‌లో తిరిగి పుంజుకున్నా.. అందుకు తగ్గట్టే సన్నద్ధమౌతున్నామని కాలింగ్‌వుడ్ పేర్కొన్నాడు. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా గురువారం నుంచి కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.

మాటల దాడి:
లార్డ్స్ టెస్టులో భారత్, ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్న సంగతి తెలిసిందే. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన జేమ్స్ అండర్సన్‌కు జస్ప్రీత్ బుమ్రా షార్ట్ పిచ్ బంతులు వేయడంతో అసలు కథ మొదలైంది. కొన్ని బంతులు దేహానికి తగలడంతో జిమ్మీ ఆవేశపడ్డాడు. మ్యాచ్ అనంతరం అతడికి సారీ చెబుదామని వెళ్లిన బుమ్రాను తోసేసి బూతులు తిట్టాడు. ఇది అన్యాయమని, కావాలనే బంతులు వేశావని రెచ్చగొట్టాడు. ఆ తర్వాతి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రాకు ఇంగ్లండ్ పేసర్లు షార్ట్ పిచ్‌ల బంతులు విసిరి గాయపర్చాలని భావించారు. ఆ క్రమంలోనే అతడిపై మాటల దాడి చేశారు. జిమ్మీకి తోడు జోస్ బట్లర్, మార్క్ వుడ్ కూడా తోడయ్యారు. దీంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వారికీ ధీటుగా బదులిచ్చాడు. ఈ క్రమంలోనే జిమ్మీ, కోహ్లీ మధ్య చిన్నపాటి వార్ నడిచింది.

ఆస్ట్రేలియా మాదిరే భారత్:
నాలుగో టెస్టుకు ముందు నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో ఇంగ్లండ్ సహాయక కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ మాట్లాడుతూ... 'భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఏమాత్రం తగ్గలేదు. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నపుడు.. విజయం సాధించడానికి చూస్తారు. ఈ క్రమంలోనే ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటుంది. రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. గొప్ప మ్యాచులలో ఇది ఒకటి. ఏదేమైనా మేం ఫలితానికి మరో వైపు నిలిచాం. ఆస్ట్రేలియా తరహా ప్రవర్తన, వారి క్రికెట్ కాలం గడిచే కొద్దీ మారుతున్నాయి. కాస్త కఠినంగా అనిపించినా భారత్ మాత్రం ఆస్ట్రేలియాలా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. ఎంతో భావోద్వేగంతో జట్టును నడుపుతున్నాడు. ఇంగ్లండ్ జట్టుగా మేం మా నిర్ణయాలపై దృష్టిపెడతాం. భారత్ చేస్తున్న దానిపై, తీసుకుంటున్న నిర్ణయాలపై మేం దృష్టి నిలపం. వారి నిర్ణయాలు వారిష్టం. మేమేం తీసుకుంటామో అదే మాకు కీలకం' అని అన్నాడు.

ఇంగ్లండ్ బౌలర్లు రెచ్చిపోయారు:
'రెండో టెస్టులో మేం అద్భుతమైన బౌలింగ్ చేశామని అనుకుంటున్నా. మీరు భారత్ వీరాభిమాని అయితే ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ను విమర్శించడంలో ఆశ్చర్యంలేదు. కానీ తొలి రోజు ఆ పిచ్‌పై బంతి అనూహ్యంగా తిరిగింది. వికెట్‌పై తేమ ఉండటంతో.. ఇంగ్లండ్ బౌలర్లు రెచ్చిపోయారు. దాంతో బ్యాట్స్‌మెన్‌కు ఆడటానికి కష్టమైంది. మ్యాచ్ పూర్తయ్యాక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లండ్ బౌలర్లను మెచ్చుకున్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం వల్లే భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడ్డారని చెప్పాడు' అని పాల్ కాలింగ్‌వుడ్ పేర్కొన్నాడు.

భారత్ పుంజుకుంటుంది:
'ఇప్పుడు నాలుగో టెస్టులో భారత జట్టు బలమైన పోటీ ఇస్తుందా అని అడిగితే.. కచ్చితంగా ఇస్తుందనే మేం అనుకుంటున్నాం. గత మ్యాచ్‌లో ఘోర బ్యాటింగ్ వైఫల్యంతో భారత బ్యాట్స్‌మెన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో రాబోయే టెస్టులో కోహ్లీసేన బలంగా పుంజుకుంటుంది. అందుకు తగ్గట్టు మేము కూడా సన్నద్ధమౌతున్నాం. భారత్ ఎంత నాణ్యమైన జట్టో మా అందరికీ తెలుసు. స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. వారికి ఎంతో అనుభవం ఉంది. తర్వాతి మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు పూర్తిస్థాయిలో రాణిస్తారనే నమ్ముతున్నాం. అలాంటప్పుడు మేం కూడా సిద్ధంగా ఉంటాం' అని పాల్ కాలింగ్‌వుడ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications