IND vs ENG: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ బుధవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు 5 సెంచరీలు చేసినప్పటికీ ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఒక టీవీ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ భారత జట్టు సీనియర్ ఆటగాళ్లకు ఒక హెచ్చరిక చేశారు.
ఈ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ .. "రిషబ్ పంత్ తన సూపర్ ఫామ్‌ను తదుపరి టెస్టులోనూ కొనసాగిస్తాడని నేను అనుకుంటున్నాను. అలాగే కేఎల్ రాహుల్ కూడా రాణిస్తాడని అనుకుంటున్నాను. రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ ఆడటాన్ని ఆనందంగా చేస్తాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేయడం సాధారణ విషయం కాదు. ఒక బ్యాటర్ మానసికంగా చాలా బలంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. రిషబ్ పంత్ 48 గంటల వ్యవధిలో దీన్ని సాధించాడంటే అతను గొప్ప ఆటగాడు. అంతే కాకుండా ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ క్రికెట్ టెస్ట్ క్రికెట్ ఆడటాన్ని రిషబ్ పంత్ ఆనందంగా స్వీకరిస్తున్నాడు.గత కొన్ని నెలలుగా రిషబ్ పంత్ సరిగా ఆడలేదు. దీని వల్ల పంత్‌కు పరుగుల దాహం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్ మొత్తం పంత్ తన ఫామ్‌ను కొనసాగిస్తాడని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా జట్టులోని మరో సీనియర్ ఆటగాడు కూడా తన ఫామ్‌ను సిరీస్ మొత్తం కొనసాగించాలి" అని సంజయ్ మంజ్రేకర్ సూచించారు.

అలాగే కేఎల్ రాహుల్ బాగా రాణిస్తాడని వివరించాడు. సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ..|"భారత క్రికెట్‌కు ఇప్పుడు కేఎల్ రాహుల్ చాలా ముఖ్యమైన ఆటగాడిగా మారిపోయాడు. కేఎల్ రాహుల్ కేవలం ఒక టెస్టులో మాత్రమే బాగా ఆడే ఆటగాడిగానో, లేదా ఒక సెంచరీ కొడితే చాలు అనుకునే ఆటగాడిగానో ఉండకూడదు. ఈ సిరీస్ మొత్తం కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాలి" అని సంజయ్ మంజ్రేకర్ తెలిపారు.
ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జులై 2 నుంచి జరగనుంది. వర్క్‌లోడ్ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా రెండో మ్యాచ్‌లో అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఇంగ్లండ్ జట్టులో స్థానం సంపాదించుకున్న జోఫ్రా ఆర్చర్ రెండో టెస్ట్ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లోకి మళ్లీ వచ్చే అవకాశం ఉంది.