
కోహ్లీకి చాలా కష్టమవుతోంది:
డైలీ మెయిల్ కోసం రాసిన తాజా కాలమ్‌లో నాసర్ హుస్సేన్ పలు విషయాలపై స్పందించాడు. 'భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. లీడ్స్ టెస్ట్ మూడో రోజు ఒక స్పెల్ ఆడాడు. అయితే అతనాడింది పాత బంతితోనని గుర్తుంచుకోవాలి. కొత్త బంతితో ఆడటం కోహ్లీకి చాలా కష్టమవుతోంది. ఎందుకంటే కొత్త బంతి ఆలస్యంగా స్వింగ్ అవుతుంది. అందుకే శనివారం (నాలుగో రోజు) అతడు ఎప్పటి మాదిరిగానే ఔటయ్యాడు' అని నాసర్ హుస్సేన్ అన్నాడు. కోహ్లీని ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్య ఒక్కటే.. అదే ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్. విదేశాల్లో ఎక్కువగా విరాట్ ఈ బంతులకే ఔట్ అవుతున్నాడు. మూడో టెస్టులో కూడా ఇలానే పెవిలియన్ చేరాడు.

వదిలేయాల్సిన బంతులను ఆడుతున్నాడు:
'నిజానికి వదిలేయాల్సిన బంతులను విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో కొద్దిగా లోపం కనిపిస్తోంది. బ్యాక్‌ఫుట్ పొజిషనింగ్ ఇబ్బందులతో జేమ్స్ అండర్సన్, ఓలి రాబిన్సన్ బంతులను ఆడలేకపోతున్నాడు. వేసేది ఇన్ స్వింగరా లేదా ఔట్ స్వింగరా గుర్తించలేక బంతిని ఆడాలా వద్దా అని సందేహపడుతున్నాడు. ఏం చేయాలో కోహ్లీకి అర్థమవ్వడం లేదు. ఇంగ్లండ్ తరహా అత్యుత్తమ బౌలింగ్ ఆడటం అతడికి ఏమంత సులువు కాదు. స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం భారత్‌కు ఇక కష్టమే' అని కామెంటేటర్ నాసర్ హుస్సేన్ పేర్కొన్నాడు.

టీమిండియాను తక్కువగా అంచనా వేయొద్దు:
మూడో టెస్టులో 78 పరుగులకే కుప్పకూలినంత మాత్రాన టీమిండియాను తక్కువగా అంచనా వేయొద్దని ఇంగ్లండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్ అంటున్నాడు. ఈ ఏడాది ఆరంబంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటైనా.. ఏకంగా సిరీస్ గెలిచిన సంగతి అతడు గుర్తు చేస్తున్నాడు. టీమిండియా బలం, తెగువ, నైపుణ్యాలు అన్ని ఉన్నాయని వెల్లడించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ అతి విశ్వాసంకు పోవద్దని, భారత్ పుంజుకునే అవకాశం ఉందని హుస్సేన్ చెప్పుకొచ్చాడు. మూడో టెస్టులో ఇంగ్లండ్ బాగా ఆడిందని, అదే ఆట సిరీస్ ఆసాంతం పునరావృతం చేయాలన్నాడు. లీడ్స్ టెస్టులో కెప్టెన్ జో రూట్ తన నాయకత్వంతో ఆకట్టుకున్నాడని హుస్సేన్ ప్రశంసించాడు.

రెండు మార్పులతో రూట్ సేన:
టీమిండియాతో నాలుగో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ వ్యక్తిగత కారణాలతో (తన భార్య రెండో బిడ్డను జన్మనివ్వనున్నందున) ఓవల్ టెస్ట్ నుంచి తప్పుకోనుండగా.. ఫాస్ట్ బౌలర్ సకీబ్ మహమూద్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వేటు వేసింది. బట్లర్ స్థానాన్ని సామ్ బిల్లింగ్స్ భర్తీ చేయనుండగా.. సకీబ్ ప్లేస్‌లో క్రిస్ వోక్స్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.


Click it and Unblock the Notifications












