ఆటగాళ్లను దూషిస్తే కోహ్లీ ఊరుకోడు.. తగిన రీతిలో జవాబిస్తాడు! చాలా జాగ్రత్తగా ఉండాలి: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

లండన్: ఆటగాళ్లను దూషించినా, వాళ్లతో దురుసుగా ప్రవర్తించినా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊరుకోడని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు. తన ఆటగాళ్లను ఏమన్నా అంటే.. విరాట్ తగిన రీతిలో జవాబిస్తాడన్నాడు. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను లక్ష్యంగా చేసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లు నోటికి పని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో టీమిండియా కెప్టెన్ కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై మాటల దాడికి దిగాడు. మొత్తానికి రెండో టెస్ట్ మాటల యుద్ధంతో ముగిసింది. ఇక భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్‌లో ఈనెల 25 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.

బుమ్రాను టార్గెట్ చేస్తూ:
రెండో టెస్టులో ఇంగ్లండ్, భారత్ జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగడంతో.. ఆధిపత్యం చెలాయించేందుకు మొదటగా ఇంగ్లండ్ ఆటగాళ్లు గొడవలు పడ్డారు. మూడో రోజు ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే.. నాలుగో రోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అండర్సన్ మధ్య మరో వివాదం చోటుచేసుకుంది. చివరి రోజు బుమ్రాని రెచ్చగొట్టారు ఇంగ్లండ్ ప్లేయర్స్. మార్క్ వుడ్, అండర్సన్ షార్ట్ పిచ్ బంతులతో బుమ్రాని గాయపర్చే ప్రయత్నం చేస్తూనే తమ నోటికి పని చెప్పారు. బట్లర్ కూడా బుమ్రాపై మాటల యుద్దానికి దిగాడు. దీంతో కోహ్లీ వారికీ ధీటుగా బదులిచ్చాడు.

రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్:
మ్యాచ్ అనంతరం టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 'రెండు కఠినమైన జట్లు తలపడితే ఇలాగే ఉంటుంది. ఆటగాళ్ల మధ్య గొప్ప పోరాటాలు దర్శనమిస్తాయి. గొప్ప నైపుణ్యాలు బయటపడతాయి. ఈ పోరాటం గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. గెలుపు కోసం రెండు జట్లు తీవ్రంగా కృషి చేశాయి. శ్రుతి మించని కవ్వింపులకు మేమేమీ వెనుకాడం. మీరు మాలో ఒకరి వెంట పడితే.. మేం మొత్తం 11 మందిమి మీ వెంట పడతాం. ఇంగ్లండ్ ఆటగాళ్ల కవ్వింపులే మా బౌలర్లలో కసి పెంచాయి. తమ సత్తా ఏంటో చూపించాలని అనుకున్నారు. ఈ మ్యాచులో వారి ప్రదర్శన అసమానం. వారిని ఎంత పొగిడినా తక్కువే' అని రాహుల్ అన్నాడు.

ఇంగ్లండ్ కోచ్ ప్రణాళిక అదే:
తాజాగా మాంటీ పనేసర్ మాట్లాడుతూ... 'భారత టెయిలెండర్లను మాటలతో రెచ్చగొట్టాలనేది ఇంగ్లండ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ ఆలోచన. కానీ భారత్ ఏ మాత్రం తగ్గలేదు. మా జట్టులోని ఒక్క ఆటగాణ్ని మీరు లక్ష్యంగా చేసుకుంటే.. మేమందరం కలిసి మీ వెంటపడతాం అన్నట్లు వ్యవహరించింది. ఆ వ్యూహం టీమిండియాకు ఫలితాన్ని అందించింది. జస్ప్రీత్ బుమ్రాను దూషిద్దామని ఇంగ్లీష్ ప్లేయర్స్ అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ ఎలా స్పందిస్తాడోనని వాళ్లు అసలు ఊహించలేకపోయారు. విరాట్ అన్ని విషయాలనూ గమనించి తిరిగి ఇంగ్లండ్‌పై ఎదురు దాడి చేశాడు. తన ఆటగాళ్లను ప్రత్యర్థులు ఏమైనా అంటే అసలు ఊరుకోడు' అని అన్నాడు.

పనేసర్ జోస్యం:
ఇంగ్లండ్‌తో మ్యాచులు ఆరంభం కాకముందే.. ఈ టెస్ట్ సిరీసుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు. టెస్టుల్లో ఇటీవలి కాలంలో అద్భుత ఫామ్ కనబర్చుతున్న కోహ్లీసేన.. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టులను 5-0తో గెలుస్తుందన్నాడు. తొలి టెస్టును వర్షం అడ్డుకోకుండా ఉంటే.. పనేసర్ జోస్యం నిజమైయ్యేదేమో. తొలి టెస్టులో ఓడాల్సిన ఇంగ్లండ్ వరణుడి దయతో తృటిలో ఓటమిని తప్పించుకుంది. 39 ఏళ్ల పనేసర్ ఇంగ్లండ్ తరఫున 50 టెస్టులు, 26 వన్డేలు, 1 టీ20 ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications