India vs England 3rd Test: జో రూట్‌ను ఎలా ఔట్ చేయాలో చెప్పిన ఇంగ్లండ్ మాజీ ప్లేయర్!!

లండన్: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను ఎలా ఔట్ చేయాలో ఆ జట్టు మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ తెలిపాడు. రూట్ క్రీజులోకి రాగానే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో బౌలింగ్ చేయించాలని సూచించాడు. ఆఫ్ స్టంప్‌కు ఆవల, నాలుగు లేదా ఐదో స్టంప్ లైన్‌లో బంతులు వేయాలని సూచించాడు. ఆతిథ్య జట్టులో కోహ్లీ సేనకు అడ్డొస్తున్నది రూట్ ఒక్కడే. ఈ సిరీసులో ఇపటివరకు జరిగిన రెండు మ్యాచుల్లో ఇంగ్లండ్ కెప్టెన్ ఏకంగా రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. 128.66 సగటుతో 386 పరుగులు సాధించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (893 రేటింగ్ పాయింట్లు) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు.

రూట్‌ను ఔట్ చేయాలంటే:
ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను ఔట్ చేయాలంటే ఆఫ్‌స్టంప్ ఆవల, ఐదో స్టంప్ లైన్‌లో బంతులు వేయాలి. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇదే ప్రణాళిక వేశాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కోహ్లీ ప్రణాళికను చక్కగా అమలు చేశాడు. తర్వాత మ్యాచుల్లోనూ విరాట్ ఇదే ప్రణాళిక అమలు చేయాలి. ఎందుకంటే.. రూట్ పుల్ షాట్ అద్భుతంగా ఆడగలడు. అందుకే షార్ట్ పిచ్ బంతులు వేయొద్దు' అని టీమిండియాకు సూచించాడు. 39 ఏళ్ల పనేసర్ ఇంగ్లండ్ తరఫున 50 టెస్టులు, 26 వన్డేలు, 1 టీ20 ఆడాడు.

ఆ నైపుణ్యాలు బుమ్రా, సిరాజ్‌కు ఉన్నాయి:
టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌కు బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడి చేయగల నైపుణ్యాలు ఉన్నాయని మాంటీ పనేసర్ ప్రశంసించాడు. వీరిద్దరూ జో రూట్‌ను అడ్డుకోగలరని తెలిపాడు. 'జో రూట్ క్రీజులోకి రాగానే విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బుమ్రాను ప్రయోగించాలి. సిరాజ్ సైతం అతడిపై బాగా ఒత్తిడి తేగలడు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఇలాగే చేశాడు. దాంతో రూట్ వికెట్ ఇచ్చేశాడు. రూట్ తన పొజిషన్ మార్చుకొనేలా చికాకు పెట్టాలి. అతడి జోరును అడ్డుకోవాలి. అలా చేస్తే అతడు పొజిషన్ మార్చుకొంటాడు. త్వరగా వికెట్ ఇచ్చేస్తాడు' అని పనేసర్ తెలిపాడు.

పనేసర్ జోస్యం:
ఇంగ్లండ్‌తో మ్యాచులు ఆరంభం కాకముందే.. ఈ టెస్ట్ సిరీసుపై మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు. టెస్టుల్లో ఇటీవలి కాలంలో అద్భుత ఫామ్ కనబర్చుతున్న కోహ్లీసేన.. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టులను 5-0తో గెలుస్తుందన్నాడు. తొలి టెస్టును వర్షం అడ్డుకోకుండా ఉంటే.. పనేసర్ జోస్యం నిజమైయ్యేదేమో. తొలి టెస్టులో ఓడాల్సిన ఇంగ్లండ్ వరణుడి దయతో తృటిలో ఓటమిని తప్పించుకుంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్‌లో ఈనెల 25 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ పోరు కూడా మొదటి రెండు టెస్టుల్లానే హోరాహోరీగా సాగనుంది.

మూడో టెస్ట్‌కు సమూల మార్పులు:
మూడో టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టును ఈసీబీ బుధవారం ప్రకటించారు. మూడో టెస్టు కోసం టీ20 స్పెసలిస్ట్ డేవిడ్ మలాన్‌ను జట్టులోకి తీసుకుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ చివరి రెండు టెస్టుల్లో తడబడిన కారణంగా మలన్‌కు ఆహ్వానం అందింది. అలాగే బ్యాట్స్‌మెన్ డామ్ సిబ్లే, జాక్ క్రాలేను పక్కనపెట్టింది. దీంతో వీరు తిరిగి తమ కౌంటీ జట్లకు ఆడనున్నారు. జాక్ లీచ్ పేరును కూడా స్క్వాడ్‌లో ప్రస్తావించలేదు. కానీ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి ప్రత్యామ్నాయంగా ఇతడు జట్టుతోనే ఉండనున్నాడు. సీమర్ సాకిబ్ మహమూద్‌కూ చోటు కల్పించారు. రోరీ బర్స్న్పై విమర్శలు వస్తున్నా మరోసారి అతడికి అవకాశం ఇచ్చింది జట్టు యాజమాన్యం. సిబ్లే గైర్హాజరుతో హసీబ్ హమీద్‌కు ఓపెనర్ అవకాశం రానుంది.

బదులు తీర్చుకుంటాం:
లార్డ్స్ టెస్ట్‌లో భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇంగ్లండ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ తెలిపాడు. చివరి రోజు ఆటలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు ఎక్కువయ్యాయని, అయితే వీటిని మ్యాచ్ గెలిచేందుకు ఉపయోగించుకోవడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నాడు. జేమ్స్ అండర్సన్‌ను రెచ్చగొడుతూ ముందుగా టీమిండియా ఆటగాళ్లే మాటల యుద్ధానికి తెరలేపారని, అందుకు తమ ప్లేయర్స్ కూడా తగు రీతిలో బదులు ఇవ్వాల్సి వచ్చిందని సొంత జట్టు ఆటగాళ్లను వెనకేసుకొచ్చాడు. రెండో టెస్టులో తాము గెలవాల్సింది, కానీ జస్ప్రీత్ బుమ్రా-మొహ్మద్ షమీ ద్వయం మ్యాచ్‌ని మలుపు తిప్పిందని వెల్లడించాడు. టీమిండియా ఓటమి తప్పించుకునే ఉద్దేశంతోనే చివరి రోజు ఆటను మొదలుపెట్టిందని సిల్వర్‌వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ ఫలితంతో కాస్త నిరాశ చెందినప్పటికీ.. టెస్టు క్రికెట్‌లోని అసలైన మజాను ఆస్వాదించామని తెలిపాడు. ఏదిఏమైనా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడాల్సిన అవసరం లేదని, మూడో టెస్ట్‌లో టీమిండియాపై కచ్చితంగా పైచేయి సాధించి లెక్క సరిచేస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

ఇంగ్లండ్ జట్టు:
జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, రోరి బర్న్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, సాకిబ్ మహమూద్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఒవర్టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, మార్క్ ఉడ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications