రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 207/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ ఇవాళ ఆటలో మరో 112 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైనప్పటికీ మిగిలిన టీమిండియా బౌలర్లు అదరగొట్టారు.
హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లిష్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇంగ్లండ్ తమ చివరి ఎనిమిది వికెట్లు 95 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగుల ఆధిక్యం లభించింది.

శనివారం ఆట ప్రారంభమైన కాసేపటికీ జో రూట్ (18; 31 బంతుల్లో)ను బుమ్రా బోల్తాకొట్టించాడు. తర్వాత ఓవర్‌లోనే బెయిర్‌స్టో (0)ను కుల్‌దీప్ యాదవ్ ఔట్ చేసి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన బెన్ స్టోక్స్ (41; 89 బంతుల్లో) కలిసి డకెట్ (153; 151 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో డకెట్ 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత కుల్‌దీప్ డకౌట్‌ను ఔట్ చేసి ప్రత్యర్థిని మరోసారి దెబ్బకొట్టాడు.
అనంతరం భారత్ తిరిగి చూడలేదు. ఆధిపత్యం చెలాయిస్తూ వరుసగా వికెట్లు తీసింది. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడి వికెట్ల వేటకు ఇంగ్లండ్ చివరి నాలుగు వికెట్లను 20 పరుగులకే కోల్పోయింది. భారత్ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు, కుల్‌దీప్, జడేజా చెరో రెండు వికెట్లు, బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేసింది.