ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఎన్నో ప్రతికూలాంశాలు లభించాయి. యువ ప్లేయర్లు భవిష్యత్ తారలుగా భరోసా ఇస్తున్నారు. రజత్ పటిదార్ మినహా మిగిలిన అరంగేట్ర భారత ప్లేయర్లు మంచి మార్కులు కొట్టేశారు. ఆకాశ్ దీప్‌కు ఒక్క టెస్టులోనే అవకాశం వచ్చినా కొత్తబంతితో తానెంతో ప్రమాదకరమని చాటి చెప్పాడు. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్ కీలక ఇన్నింగ్స్‌లతో అలరించారు. యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండటం టీమిండియాకు మరో బోనస్ పాయింట్.
అయితే టీమిండియాకు ఊహించని లాభాన్ని తెచ్చిపెట్టింది కుల్‌దీప్ యాదవ్. స్పిన్నర్ అయిన కుల్‌దీప్ బ్యాటుతో అలరిస్తున్నాడు. సాలిడ్ డిఫెన్స్‌తో ప్రధాన బ్యాటర్లకు దీటుగా ఆడుతున్నాడు. గింగరాలు తిరిగే బంతుల్ని, శరీరం మీదకు దూసుకొచ్చిన బౌన్సర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రధాన బ్యాటర్ల బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో కంటే కుల్‌దీప్ ఎక్కువ బంతుల్ని ఎదుర్కోవడం విశేషం.

ఆరు ఇన్నింగ్స్‌ల్లో కుల్‌దీప్ యాదవ్ 362 బంతులు ఎదుర్కొన్నాడు. మరోవైపు తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో బెన్ స్టోక్స్ 357, బెయిర్ స్టో 259 బంతులు మాత్రమే ఆడటం గమనార్హం. కుల్‌దీప్‌తో పాటు బుమ్రా కూడా క్రీజులో పాతుకుపోతున్నాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న అయిదో టెస్టులో బుమ్రా, కుల్‌దీప్ అరుదైన ఘనత అందుకున్నారు. ధర్మశాల టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరు దాదాపు 22 ఓవర్ల పాటు ఇంగ్లండ్ బౌలర్లను పరీక్షించారు.
మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆఖరి ఆరు వికెట్ల భాగస్వామ్యాలు కేవలం 14 ఓవర్లు పాటే నడిచాయి. కానీ కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వాళ్ల కంటే గొప్పగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లండ్ బ్యాటర్లు సిగ్గుపడేలా అద్భుత ప్రదర్శన చేస్తున్నారని కుల్‌దీప్, బుమ్రాను నెటిజన్లు కొనియాడుతున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో కుల్‌దీప్ (30; 69 బంతుల్లో), బుమ్రా (20; 64 బంతుల్లో) పరుగులు చేశారు. కాగా, ఆఖరి టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. శనివారం లంచ్ విరామానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 5 వికెట్లకు 103 పరుగులు చేసింది. ఇంగ్లిష్ జట్టు ఇంకా 156 పరుగుల వెనుకంజలో ఉంది.