సొంతగడ్డపై జరుగుతున్న ఇంగ్లండ్ టెస్టులో బ్యాటింగ్‌లో విఫలమైనా స్టన్నింగ్ క్యాచ్‌తో టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ అదరగొట్టాడు. వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆటలోనూ భారత్ టాప్‌లో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 28/0తో ఆదివారం ఆటను ఆరంభించిన టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (104; 147 బంతుల్లో) సెంచరీతో చెలరేగాడు. అక్షర్ పటేల్ (45; 84 బంతుల్లో) సెకండ్ టాప్ స్కోరర్. భరత్ 28 బంతులు ఎదుర్కొని ఆరు పరుగులే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ 23 బంతుల్లో 17 పరుగులతో నిరాశపరిచాడు.
అయితే మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంతో ఇంగ్లండ్‌కు భారత్ 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనకు వచ్చిన ఇంగ్లండ్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఓపెనర్లు జాక్ క్రాలే (29*; 50 బంతుల్లో), బెన్ డకెట్ (28; 27 బంతుల్లో) వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించారు. బుమ్రా బౌలింగ్‌లో మినహా మిగిలిన బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు సాధించారు.

అయితే అశ్విన్ తన తొలి ఓవర్‌లోనే డకెట్‌ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు.డకెట్ డిఫెండ్‌కు యత్నించగా ఎడ్జ్ తీసుకుని తన ప్యాడ్లకు తగిలి బంతి గాల్లోకి ఎగిరింది. భరత్ వెంటనే సమయస్ఫూర్తితో స్పందించి మెరుపు వేగంతో కదిలి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. వెంటనే అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. మరోవైపు ఇంగ్లండ్ బ్యాటర్ డకెట్ భరత్ క్యాచ్‌ను చూసి నిస్సహాయంగా మైదానాన్ని వీడాడు. ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో రెహాన్ అహ్మద్ (9*; 8 బంతుల్లో), క్రాలే ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు, ఇంగ్లండ్ 253 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
కాగా, భరత్ వైజాగ్‌కు చెందిన వాడు. ఇప్పటివరకు ఏడు టెస్టులు ఆడిన భరత్ అత్యధిక స్కోరు 44 మాత్రమే. 12 ఇన్నింగ్స్‌ల్లో 20 సగటుతో 221 పరుగులే చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సత్తాచాటుతున్న భరత్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన ప్రతిభకు తగ్గ ప్రదర్శన ఇప్పటివరకు చేయలేదు.