
లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే సెంచరీ హీరో కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. ఓవర్ నైట్ స్కోరు 276/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరుకు రెండు పరుగులు మాత్రమే జోడించిన అనంతరం రాహుల్ (129) అవుటయ్యాడు. ఆ తర్వాత మరో నాలుగు పరుగులకే అజింక్య రహానే కూడా అవుటయ్యాడు. ఒక్క పరుగు మాత్రమే చేసిన రహానే.. జేమ్స్ అండర్సన్‌కు దొరికిపోయాడు. ప్రస్తుతం రిషభ్ పంత్, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. భారత్ 100 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 127తో బ్యాటింగ్ కొనసాగించిన కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12x4, 1x6) మొదటి బంతికి రెండు పరుగులు తీసి.. రెండో బంతికి ఔటైపోయాడు. శుక్రవారం తొలి సెషన్‌లో ఓలీ రాబిన్సన్ మొదటి ఓవర్ వేయగా తొలి బంతికి రెండు పరుగులు చేసిన రాహుల్.. రెండో బంతికి కవర్ డ్రైవ్ ఆడాడు. కానీ షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్‌కాకపోవడంతో బంతి నేరుగా వెళ్లి ఫీల్డర్ డొమినిక్ సిబ్లే చేతుల్లో పడింది. దీంతో భారత్ 278 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
కేఎల్ రాహుల్ ఔట్ అయిన తర్వాతి ఓవర్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే (1: 23 బంతుల్లో) పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్తున్న బంతిని వెంటాడి స్లిప్‌లో జో రూట్ చేతికి చిక్కాడు. జేమ్స్ అండర్సన్ ఈరోజు ఆటలో వేసిన తొలి బంతికే రహానేని ఔట్ చేయడం గమనార్హం. గురువారం నాటి స్కోరుకి కనీసం ఒక పరుగు కూడా రహానే యాడ్ చేయలేకపోయాడు. దీంతో రహానేపై ఫాన్స్ మండిపడుతున్నారు. ఇక భారత్ వెళ్లిపో ఒకరు కామెంట్ చేయగా.. మిగతా రెండు టెస్టులకు విశ్రాంతి తీసుకో అని మరొకరు కామెంట్ చేశారు.
లార్డ్స్‌లో జరిగిన టెస్టులో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. 1952లో వినూ మాన్కడ్ 184 పరుగులు చేయగా.. ఆ తర్వాత దిలీప్ వెంగ్‌సర్కార్ 1982లో 157 పరుగులు చేశాడు. ఇక మూడో స్థానంలో సౌరవ్ గంగూలీ 1996లో చేసిన 131 పరుగుల రికార్డ్ ఉంది. వీరి తర్వాత కేఎల్ రాహుల్ 129 పరుగులతో ఈ జాబితాలో నిలిచాడు. రాహుల్ డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ ఆశించారు కానీ అలా జరగలేదు.
టెస్టు కెరీర్‌లో ఆరో శతకం చేసిన లోకేష్ రాహుల్ లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించిన మూడో భారత ఓపెనర్‌గా ఘనత సాధించాడు. అంతకుముందు రవిశాస్త్రి (1990), వినోద్ మన్కడ్ (1952)లు మాత్రమే లార్డ్స్‌లో సెంచరీ సాధించిన భారత ఓపెనర్లు కాగా.. వారి సరసన ఇప్పుడు రాహుల్ చేరిపోయాడు. ఆసియా బయట టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి రాహుల్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో సునీల్ గావస్కర్ 15 సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా. సెహ్వాగ్-రాహుల్‌లు తలో నాలుగు సెంచరీలు సాధించారు.