భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ క్లైమాక్స్ చేరుకుంది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఆఖరి టెస్టు జరగనుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నామమాత్రపు ధర్మశాల టెస్టులోనూ విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. టెస్టు ఛాంపియన్‌షిప్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి టెస్టు కీలకం కానుంది.
అయితే ఈ సిరీస్ అనంతరం ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టోపై వేటు తప్పదని ఆ జట్టు మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. బెయిర్‌స్టోకు ధర్మశాల టెస్టు ప్రత్యేకంగా నిలవనుంది. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన అతడు 100వ మ్యాచ్‌ను ధర్మశాలలో ఆడనున్నాడు. బెయిర్‌స్టోతో పాటు రవిచంద్రన్ అశ్విన్ కూడా తన సెంచరీ టెస్టును ధర్మశాలలోనే ఆడనుండటం విశేషం.

కాగా, ధర్మశాల టెస్టు అనంతరం 101వ టెస్టు ఆడటం కోసం బెయిర్‌స్టోకు ఎదురుచూపులు తప్పవని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. ''జానీ బెయిర్‌స్టో తన 100వ టెస్టును ధర్మశాలలో ఆడనున్నాడు. ఈ ఘనత పట్ల సంతోషిస్తున్నా. ఇవి భావోద్వేగ క్షణాలు. 99 టెస్టులు ఆడిన ఆటగాడు కచ్చితంగా 100వ టెస్టుతో గౌరవించబడతాడు. కానీ 101 టెస్టు ముందు తప్పించుకోవడానికి అవకాశాలు లేవు. బెయిర్‌స్టో గత 10 టెస్టుల్లో నిరాశపరిచాడు. ముఖ్యంగా భారత్‌లో సత్తాచాటలేకపోయాడు'' అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ ఆటగాళ్లకు మేనేజ్మెంట్ అతిగా మద్దతు ఇవ్వడాన్ని మైకేల్ వాన్ తప్పుబట్టాడు. ఆటగాళ్లకు సెలక్షన్ ఒత్తిడి ఉండాలని అన్నాడు. తమ స్థానం సుస్థిరమని ఆటగాళ్లు భావిస్తే సౌకర్యంగా ఉంటారని పేర్కొన్నాడు. జట్టులో స్థానం కోసం పోటీ ఉంటే ఆటగాళ్ల నుంచి మంచి ప్రదర్శన రాబట్టుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా, భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బెయిర్‌స్టో 170 పరుగులే చేశాడు. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 38 పరుగులే అత్యధిక స్కోరు. గత నాలుగు టెస్టుల్లో వరుసగా 37, 10, 25, 26, 0, 4, 38, 30 పరుగులు చేశాడు.