
లీడ్స్: మూడో టెస్ట్ విజయం కచ్చితంగా బౌలర్లదే అని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అన్నాడు. వికెట్లు తీసే అవకాశం దొరికినప్పుడు కనికరం లేకుండా విరుచుకుపడ్డామన్నాడు. తమ ప్లేయర్స్ మంచి ప్రదర్శన చేస్తామని తమకు ముందే తెలుసని రూట్ పేర్కొన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైన కోహ్లీసేన.. మూడేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టు చేతిలో ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసింది. 2018 లార్ట్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్.. మూడో టెస్ట్‌లో మళ్లీ అంతటి ఘోర పరాభవాన్ని రుచి చూసింది.
మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ... 'ఇది బౌలర్ల విజయం. మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. వరుస మైయిడిన్ ఓవర్లతో భారత ఆటగాళ్లపై ఒత్తిడి పెంచారు. వికెట్లు తీసే అవకాశం దొరికినప్పుడు కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. మా వాళ్ళు ఇలాంటి మంచి ప్రదర్శన చేస్తామని ముందే తెలుసు. అంతటి నైపుణ్యం ఇంగ్లండ్ జట్టుకు ఉంది. ఈ క్రమంలోనే నాలుగో రోజు కొత్త బంతితో చెలరేగారు. ఫలితంగానే ఇన్నింగ్స్ విజయం సాధించాం' అని అన్నాడు.
బంతితో జేమ్స్ అండర్సన్ మాయ చేశాడని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కొనియాడాడు. ఇప్పటికీ అండర్సన్ ఇతర బౌలర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడని, అందుకే అతడిని టెస్టు క్రికెట్‌లో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్' అని అభివర్ణిస్తారని అన్నాడు. జిమ్మీ చాలా ఫిట్‌గా ఉన్నాడని, మరింతకాలం అతడు ఆటలో కొనసాగుతాడన్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించిన ఓపెనర్లు రోరీ బర్న్స్, హమీద్‌తో పాటు డేవిడ్ మలన్ కూడా బాగా ఆడారన్నాడు. తన హోమ్ గ్రౌండ్‌లో చాలా రోజుల తర్వాత శతకం బాదడం గొప్పగా ఉందని రూట్ పేర్కొన్నాడు. ఇక ముందు కూడా ఇలాంటి ప్రదర్శనతోనే ముందుకు సాగుతామన్నాడు.
ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైన ఓలి రాబిన్‌సన్‌ను గురించి జో రూట్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని పేర్కొన్నాడు. రాబిన్‌సన్ బంతిని రెండు వైపులా తిప్పుతూ భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడన్నాడు. సామ్ కరన్‌పై స్పందించిన రూట్.. అతడు ఈ మ్యాచ్‌లో రాణించకపోయినా కీలక ఆటగాడని గుర్తు చేశాడు. గతంలో టీమిండియాపై మంచి ప్రదర్శన చేసినట్లు చెప్పుకొచ్చాడు. జొస్ బట్లర్ పితృత్వపు సెలవులపై స్పందిస్తూ.. దాని గురించి తర్వాత తెలుస్తుందని ఇంగ్లండ్ కెప్టెన్ చెప్పాడు. మిగిలిన రెండు టెస్టుల్లోనూ తాము ఇలాగే ఆడతామనే ధీమా వ్యక్తం చేశాడు.
మూడో టెస్టులో స్కోరు బోర్డుపై ఉన్న భారీ పరుగులే భారత జట్టును ఒత్తిడికి గురిచేశాయని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. నాలుగో రోజు తమ బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురయ్యారన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమని తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూల్చిన తర్వాత భారీ స్కోర్ సాధించినప్పుడు వెనుకబడిపోయామని అర్థమైందని కోహ్లీ చెప్పాడు. నాలుగో రోజు ఉదయం ఇంగ్లీష్ బౌలర్లు అద్భుతంగా చెలరేగారని, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడి తెచ్చారన్నాడు. ఈ క్రమంలోనే తాము కూడా సరైన రీతిలో ఆడలేకపోయామని స్పష్టం చేశాడు. అయితే ఇంగ్లండ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఎవరైనా కుప్పకూలడం సాధారణ విషయమని కోహ్లీ పేర్కొన్నాడు.