
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసేసమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ అయింది. మొహ్మద్ షమీ వేసిన 127.5 ఓవర్‌కు జేమ్స్ అండర్సన్ (0) బౌల్డయ్యాడు. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (180; 321 బంతుల్లో 18x4) భారీ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. జానీ బెయిర్‌స్టో (57; 107 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీ చేయగా.. రోరీ బర్న్స్ 49 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో మొహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ 3, మొహ్మద్ షమీ 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. లోకేష్ రాహుల్ సెంచరీ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో రూట్ సేనకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.
జానీ హాఫ్ సెంచరీ:
శనివారం ఉదయం 119/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన జో రూట్, జానీ బెయిర్‌స్టో మొదటగా వికెట్ కాపాడుకున్నారు. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 48తో బ్యాటింగ్ కొనసాగించిన రూట్.. ఇన్నింగ్స్ 47వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఫోర్‌తో హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. మరోవైపు క్రీజులో కుదురుకున్న బెయిర్‌స్టో దూకుడుగా ఆడాడు. రూట్, బెయిర్‌స్టోలు ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పెట్టింది. ఈ క్రమంలోనే బెయిర్‌స్టో.. ఇషాంత్ శర్మ వేసిన 71వ ఓవర్ రెండో బంతికి సింగల్ తీసి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది.
రూట్ సెంచరీ:
రెండో సెషన్ ఆదిలోనే జానీ బెయిర్‌స్టో (57) ఔట్ అయ్యాడు. మొహ్మద్ సిరాజ్ వేసిన 78.4 ఓవర్‌కు అతడు షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి గాల్లోకి లేచింది. స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ 229 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం జస్ప్రీత్ బుమ్రా వేసిన 82వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 200 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో శతకం చేశాడు. మరోవైపు జోస్ బట్లర్ కూడా వికెట్ కాపాడుకుంటూ ఆడాడు. ఈ క్రమంలోనే రూట్ (117) టెస్టుల్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
టెయిలెండర్లతో కలిసి రూట్ సూపర్ ఇన్నింగ్స్:
ఇషాంత్ శర్మ వేసిన 91వ ఓవర్ చివరి బంతికి జోస్ బట్లర్ (23; 42 బంతుల్లో 4x4) ఔటయ్యాడు. దాంతో ఇంగ్లండ్ 283 పరుగుల వద్ద ఐదో వికెట్ నష్టపోయింది. మరోవైపు జో రూట్ మాత్రం పరుగులు చేస్తూ పోయాడు. మోయిన్ అలీ అండతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అలీ కూడా ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 289 పరుగుల వద్ద తేనేటి విరామంకు వెళ్లింది. మూడో సెషన్లో రూట్, అలీ జోడీ ఆధిపత్యం చెలాయించాలని చూశారు. ఇషాంత్ ఇషాంత్ దెబ్బకొట్టాడు. అలీని ఔట్ చేయడంతో పాటు సామ్ కరన్‌ను కూడా డకౌట్ చేశాడు. అలా ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి భారత్ స్కోరుకు చేరువైంది. కాసేపటికే రాబిన్‌సన్ (6).. సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం టెయిలెండర్లతో కలిసి రూట్ తన జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మార్క్ వుడ్(5) రనౌట్ కాగా, మూడో రోజు ఆఖరి బంతికి అండర్సన్ (0) బౌల్డయ్యాడు. దాంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
కెప్టెన్‌గా అరుదైన రికార్డు:
రెండో టెస్టులో జో రూట్ సెంచరీ బాదడంతో కెప్టెన్‌గా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒక కేలండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్‌గా రూట్ రికార్డుల్లోకెక్కాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూట్ 5 సెంచరీలు బాదాడు. ఈ జాబితాలో గ్రాహం గూచ్ (1990), మైఖేల్ అర్ధర్‌టన్ (1994), ఆండ్రూ స్ట్రాస్ (2009) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరందరూ ఒక కేలండర్ ఇయర్‌లో నాలుగేసి సెంచరీలు బాదారు. ఈ ఏడాది టీమిండియాపైనే రూట్ మూడు శతకాలు బాదడం విశేషం.
అత్యధిక టెస్టు సెంచరీలు:
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా కూడా జో రూట్ మరో రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసింది మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్. కుక్ 33 శతకాలు బాదాడు. మాజీసారథి కెవిన్ పీటర్సన్ 23 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో ఐదుగురు బ్యాట్స్‌మన్‌లు ఉన్నారు. వాలీ హమ్మండ్, కోలిన్ కౌడ్రీ, జెఫ్రీ బాయ్‌కాట్, ఇయాన్ బెల్ ఇప్పటివరకు ఉండగా.. తాజాగా ఈ జాబితాలో జో రూట్ చేరాడు. వీరందరూ ఇంగ్లండ్ తరఫున 22 టెస్ట్ సెంచరీలు బాదారు. ఇక టెస్టు క్రికెట్‌లో బ్యాక్ టు బ్యాక్ ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్‌గా జో రూట్ నిలిచాడు. ఇప్పటి వరకూ మాజీ ఆటగాడు ఇయాన్ బెల్ మాత్రమే ఈ రికార్డ్‌లో ఉండగా.. అతను 2013 యాషెస్ టెస్టు సిరీస్‌లో ఈ ఘనత సాధించాడు. నాటింగ్‌హామ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ 109 పరుగులు చేసిన విషయం తెలిసిందే. టెస్టు కెరీర్‌లో జో రూట్‌కి ఇది 22వ టెస్టు శతకం కాగా.. ఇంగ్లీష్ కెప్టెన్‌గా ఇది 11వ టెస్టు సెంచరీ కావడం విశేషం.