
వేగంగా 100 టెస్టు వికెట్లు:
నాలుగవ టెస్టు మ్యాచుకు ముందు అత్యంత వేగంగా టెస్టుల్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి భారత పేసర్‌గా కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఓవల్ టెస్ట్ మ్యాచుకు ముందు వరకూ 23 టెస్టులాడి 22.62 సగటుతో 96 వికెట్లు పడగొట్టాడు జస్ప్రీత్ బుమ్రా. దాంతో 96 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్ లో మరో రెండు వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అరుదైన ఘనతని సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (28 టెస్టుల్లో 100 వికెట్లు), సీనియర్ పేసర్ మొహ్మద్ షమీ (29 టెస్టుల్లో 100 వికెట్లు)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

తొలి వికెట్ ఏబీ:
2018లో భారత టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసిన జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకూ 24 టెస్టులాడి (ఓవల్ టెస్ట్ సహా) 22.08 సగటుతో 100 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఏకంగా ఆరు సార్లు అతను 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. నాలుగు వికెట్ల ప్రదర్శన 4 సార్లు ఉన్నాయి. అత్యుత్తమ ప్రదర్శన 6/27. ఓవల్ టెస్ట్ ద్వారా టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ప్రస్తుతం బుమ్రా టాప్‌లో ఉన్నాడు. బుమ్రా తొలి టెస్ట్ వికెట్ దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కాగా.. 100వ వికెట్ ఓలి పోప్. ఇద్దరూ కూడా బోల్డ్ అవ్వడం విశేషం.

చెత్త రికార్డు కూడా:
అయితే ఈ సిరీసులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్న విషయం తెలిసిందే. ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన భారత బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఈ యార్కర్ల కింగ్ తేలిపోయాడు. 26 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 79 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతేకాకుండా 13 నో బాల్స్ వేశాడు. 2002లో జహీర్ ఖాన్ (విండీస్‌పై) తర్వాత మరే భారత బౌలర్ ఇన్ని నోబాల్స్ వేయలేదు. వికెట్లు రావట్లేదనే అసహనంలో బుమ్రా మరింత వేగంగా బంతులు వేయాలని ఈ తప్పిదం చేశాడు.

విజయానికి నాలుగు వికెట్ల దూరంలో భారత్:
నాలుగో టెస్టులో భారత జట్టు విజయం దిశగా దూసుకెళ్తోంది. 147 పరుగులకే 6 వికెట్లు కూల్చిన భారత్.. విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. మరోవైపు ఒత్తిడి భరించలేని ఇంగ్లండ్ క్రికెటర్లు భారత బౌలర్లకు వికెట్లు ఇచ్చేస్తున్నారు. లంచ్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన ఇంగ్లండ్ పటిష్టంగానే ఉన్నట్టు కనిపించింది. ఆ తర్వాత హసీబ్ హమీద్ (63), ఒల్లీ పోప్ (2), జానీ బెయిర్‌స్టో (0), మొయీన్ అలీ (0) ఒకరి తర్వాత ఒకరిగా వెనుదిరిగారు. కెప్టెన్ జో రూట్ మాత్రం క్రీజులో కుదురుకుని ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసిన ఇంగ్లండ్ విజయానికి 219 పరుగుల దూరంలో నిలిచింది. రూట్ (18), వోక్స్ (2) క్రీజులో ఉన్నారు. బుమ్రా, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు.


Click it and Unblock the Notifications












