IND vs ENG: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీసే చివరిది.. ఇక ఆ దిగ్గజంను మైదానంలో చూడలేం!!

లండన్: ఇంగ్లండ్ సీనియర్ పేసర్, స్వింగ్ మాస్టర్ జేమ్స్ అండర్సన్‌కు ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీసే చివరిదని ఇంగ్లీష్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ జోస్యం చెప్పాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 10న ఆరంభం కానున్న ఐదవ టెస్ట్ మ్యాచ్.. అండర్సన్ ఆడే చివరి మ్యాచ్ అని పేర్కొన్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్ట్ ముగిసిన అనంతరం జిమ్మీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తాడని హార్మిసన్ తెలిపాడు. 39 ఏళ్ల అండర్సన్ టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టాప్ ఫామ్‌లో ఉన్నాడు. మూడు టెస్టుల్లో ఇప్పటికే 13 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది జిమ్మీ 30 వికెట్లు తీయగా.. అందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది.

ఫన్నీ ఫీలింగ్:
తాజాగా టాక్‌స్పోర్ట్ క్రికెట్ పోడ్‌కాస్ట్‌తో ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ మాట్లాడుతూ జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్ విషయంపై స్పందించాడు. 'ప్రస్తుతం నా మదిలో ఓ ఫన్నీ ఫీలింగ్ మెదులుతోంది. అది నిజం అవుతుందో లేదో నాకు కూడా సరిగ్గా తెలియదు. ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్ట్ అనంతరం జేమ్స్ ఆండర్సన్ రిటైర్ అవుతాడని నాకు అనిపిస్తోంది. ఇదే నా మదిలో ఉన్న ఫన్నీ ఫీలింగ్. అండర్సన్ యాషెస్ సిరీస్ దాదాపు ఆడడు. ఓవల్, ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో మంచి ప్రదర్శన చేసి వీడ్కోలు చెపుతాడు. బహుశా విరాట్ కోహ్లీ వికెట్‌తో అతడు తన కెరీర్ ముగించొచ్చు' అని హార్మిసన్ అన్నాడు.

165 టెస్ట్ మ్యాచుల్లో 630 వికెట్లు:
39 ఏళ్ల జేమ్స్ అండర్సన్ ఇంగ్లండ్ తరఫున 165 టెస్ట్ మ్యాచుల్లో 630 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 7/42. 31 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. బ్యాట్‌తో 1246 రన్స్ చేశాడు. అత్యధిక స్కోర్ 81. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన అండర్సన్.. టెస్ట్ ఫార్మాట్ కొనసాగించేందుకు 2015 నుంచి పరిమిత ఓవర్లకు దూరమయ్యాడు. అయితే 'ది హండ్రెడ్'తో వైట్-బాల్ క్రికెట్‌కి తిరిగి రావాలనే ఆలోచన చేసినా.. తన టెస్ట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆడలేదు. జిమ్మీ 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్ల కంటే.. టెస్టుల్లోనే జిమ్మీ సత్తాచాటాడు. స్వింగ్ కింగ్‌గా పేరొందాడు.

అత్యధికంగా మెయిడిన్ ఓవర్లు:
భారత్‌తో ముగిసిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు అత్యధికంగా మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు అండర్సన్ భారత్‌కు 330 మెయిడిన్ ఓవర్లు వేసాడు. దాంతో ఈ రికార్డు హోల్డర్‌గా ఉన్న ఇంగ్లండ్ మాజీ బౌలర్ డెరెక్ అండర్‌వుడ్‌ను జిమ్మీ అధిగమించాడు. అండర్‌వుడ్ భారత్‌కు 322 మెయిడిన్ ఓవర్లు వేసాడు. టెస్ట్‌ల్లో ఓవరాల్‌గా 1529 ఓవర్లు వేసిన అండర్సన్.. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీదరణ్ 1792 మెయిడిన్ ఓవర్లు వేశాడు.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు:
మూడో టెస్ట్ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టిన స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్.. ఇంగ్లీష్ గడ్డపై టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా అండర్సన్ నిలిచాడు. 94 టెస్టుల్లో అండర్సన్ ఈ ఘనత సాధించగా.. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ 73 టెస్టుల్లోనే 493 వికెట్లతో ఈ రికార్డ్‌లో టాప్‌లో ఉన్నాడు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జిమ్మీ (630) మూడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు తీసిన వారిలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అనిల్ కుంబ్లే 619 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications