ENG vs IND: ఎలా ఆడాలో రాహుల్, రోహిత్ చూపించారు.. మాపై ఒత్తిడి పెంచారు: ఇంగ్లండ్ పేసర్

లండన్: ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎలా ఆడాలో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ చూపించారని ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. వారిద్దరూ తమను లెంగ్తులు మార్చుకొనేలా ఒత్తిడి చేశారని పేర్కొన్నాడు. లార్డ్స్ మైదానం మరోసారి తనలోని అత్యుత్తమ ఆటతీరును వెలికితీసిందని జిమ్మీ వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అండర్సన్.. 1951 తర్వాత ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు.

అదే మా ప్రణాళిక:
ఓవర్ పిచ్ అవ్వకుండా సాధ్యమైనంత ఫుల్ లెంగ్త్ బంతులు వేయాలన్నది తమ ప్రణాళిక అని జేమ్స్ అండర్సన్ చెప్పాడు. రెండో రోజు ఆట అనంతరం జిమ్మీ మాట్లాడుతూ... 'సాధ్యమైనంత వరకు ఫుల్‌లెంగ్త్ బంతులు వేసేందుకు ప్రయత్నించాం. కొద్దిగా గతి తప్పినా సులభంగా డ్రైవ్ చేయొచ్చు. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో భారత ఓపెనర్లు చూపించారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అద్భుతంగా ఆడారు. ఇద్దరూ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. అవసరమైన బంతుల్ని వదిలేశారు. మిగతావి డిఫెండ్ చేశారు. ఫుల్ లెంగ్త్ బంతులు వేసేలా ఒత్తిడి చేశారు. అలా చేయగానే శిక్షించడం మొదలుపెట్టారు' అని అండర్సన్ అన్నాడు.

ఇదే చివరిసారి అనుకుంటూ వస్తా:
రెండో రోజుకు తమకు కాస్త అదృష్టం కలిసొచ్చిందని జేమ్స్ అండర్సన్ అన్నాడు. కేఎల్ రాహుల్ డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించడంతో సరైన లెంగ్త్ దొరికిందని వెల్లడించాడు. 'లార్డ్స్ మైదానం నాకెంతో ప్రత్యేకం. ప్రతిసారీ ఇదే చివరిసారి అనుకుంటూ వస్తాను. ఇప్పుడు మాత్రం అలా అనుకోవడం లేదు. ఈ మైదానం నాలోని అత్యుత్తమ ఆటతీరును వెలికితీస్తుంది. ఇక జో రూట్ ఎంతో కళాత్మకంగా ఆడాడు. మొహ్మద్ సిరాజ్ వేసిన బంతులను అద్భుతంగా డిఫెండ్ చేశాడు. ఐదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఓపెనర్ హసీబ్ హమీద్ తొలి బంతికే ఔటవ్వడం కాస్త బాధాకరం' అని జిమీ తెలిపాడు.

70 ఏళ్ల తర్వాత:
జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన జిమ్మీ.. గత 70 ఏళ్లలో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టెస్టు క్రికెట్‌లో అతి పెద్ద వయసులో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ జెఫ్ చబ్ పేరిట ఉంది. 1951లో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో చబ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అప్పటికి అతడి వయసు 40 ఏళ్ల 86 రోజులు. 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు జేమ్స్ అండర్సన్ 39 ఏళ్ల 14 రోజుల వయసులో ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు.

ఇది 31వ సారి:
టెస్టులో ఐదు వికెట్ల ఘనత సాధించడం జేమ్స్ అండర్సన్‌కు ఇది 31వ సారి. ప్రస్తుత ఆటగాళ్లలో ఆర్ అశ్విన్ (30), స్టువర్ట్ బ్రాడ్ (18), షకిబుల్ హాసన్ (18), నాథన్ లియోన్ (18) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తొలి రోజు రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారాను ఔట్ చేసిన అండర్సన్.. రెండో రోజు అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అండర్సన్ వయసు 39 ఏళ్లు. ఈ వయసులో కూడా తనలో ఏమాత్రం పదును తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. బుల్లెట్ బంతులతో బ్యాట్స్‌మన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు.

భారత్‌పై మంచి రికార్డే:
జేమ్స్ అండర్సన్‌కు లార్డ్స్ మైదానంలో భారత్‌పై మంచి రికార్డే ఉంది. 2007 నుంచి చూసుకుంటే భారత్‌పై లార్డ్స్ టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అండర్సన్.. మరో రెండుసార్లు నాలుగు వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా లార్డ్స్ మైదానంలో టీమిండియాపై అండర్సన్ టెస్టుల్లో ఇప్పటివరకు 33 వికెట్లు తీశాడు. తొలి టెస్టు మూడో రోజు కేఎల్ రాహుల్‌ను అవుట్ చేసిన అండర్సన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజ అనిల్ కుంబ్లేను అధిగమించాడు. మొత్తంగా అండర్సన్ 164 టెస్టుల్లో 626 వికెట్లు తీశాడు.

మొయిన్ అలీ కూడా:
ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ టీమిండియాపై టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌పై టెస్టుల్లో 50 వికెట్లు తీసిన ఆరో స్పిన్నర్‌గా అలీ నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో మొహ్మద్ షమీ వికెట్ తీయడం ద్వారా అలీ ఈ ఘనతను అందుకున్నాడు. భారత్‌పై టెస్టుల్లో ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) 105 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా) 94 వికెట్లతో రెండో స్థానంలో, 63 వికెట్లతో లాన్స్ గిబ్స్ (వెస్టిండీస్) మూడో స్థానంలో, అండర్ వుడ్ (ఇంగ్లండ్) 62 వికెట్లతో నాలుగులో స్థానంలో, 52 వికెట్లతో బెనాడ్ (ఆస్ట్రేలియా) ఐదో స్థానంలో ఉన్నారు.

మరోసారి రూట్ హవా:
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట పూర్తయింది. ఆట ముగిసేసమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ (48 నాటౌట్; 75 బంతుల్లో 6x4), జానీ బెయిర్‌స్టో (6 నాటౌట్; 17 బంతుల్లో) పరుగులతో క్రీజులో ఉన్నారు. సిబ్లీ (11), హమీద్ (0) నిరాశపర్చగా.. రోరీ బర్న్స్ (49; 136 బంతుల్లో 7x4) ఆకట్టుకున్నాడు. భారత పేసర్ మొహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్‌కు 245 పరుగులు వెనకబడి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications