
కుంబ్లేను అధిగమించి:
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో గురువారం రెండో రోజు అండర్సన్ ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. 41వ ఓవర్‌లో చెతేశ్వర్ పుజారా (4), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దాంతో 619 వికెట్లతో గురువారం అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు. శుక్రవారం మూడో రోజు ఆటలో కేఎల్ రాహుల్ (84; 214 బంతుల్లో 12x4)ను ఔట్ చేయడంతో అండర్సన్ టెస్టుల్లో కొత్త రికార్డు సృష్టించాడు. కుంబ్లేను అధిగమించి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ 563 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

తొలి ఫాస్ట్ బౌలర్:
జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌తో మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్‌ను వెనక్కి నెట్టిన జేమ్స్ అండర్సన్.. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 163 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జిమ్మీ 621 వికెట్లు తీశాడు. ఐదు వికెట్ల ప్రదర్శన 30సార్లు చేశాడు. అలిస్టర్ కుక్ 161 టెస్టులతో రెండో స్థానంలో ఉన్నాడు. కుక్ 12472 పరుగులు చేశాడు. కుక్ తర్వాత స్టువర్ట్ బ్రాడ్ 149 టెస్టులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బ్రాడ్ 523 వికెట్లు పడగొట్టటాడు. మరోవైపు టెస్టుల్లో 600 వికెట్లకు పైగా తీసిన ఫాస్ట్ బౌలర్లలో అండర్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

2003లో అరంగేట్రం:
2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన జేమ్స్ అండర్సన్.. ఇప్పటివరకు 621 వికెట్లు తీశాడు. అందులో 28సార్లు నాలుగు వికెట్ల ఘనతను, 30సార్లు ఐదు వికెట్ల హాల్స్ అందుకున్నాడు. షార్టెస్ట్ ఫార్మాట్‌లో 194 వన్డేలు 19 టీ20లు ఆడిన జిమ్మీ.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 269 వికెట్లు, పొట్టి క్రికెట్‌లో 18 వికెట్లు తీశాడు. భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్ ఓటమికి అండర్సన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఐదు మ్యాచుల ఈ టెస్ట్ సిరీసులో జిమ్మీ కీలకం కానున్నాడు. సొంత గడ్డపై తన స్వింగ్ ప్రభావాన్ని చూపాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

నాలుగు వికెట్లు తీసిన జిమ్మీ:
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. చివర్లో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (28; 34 బంతుల్లో 3x4, 1x6) బౌండరీల వర్షం కురిపిస్తూ విలువైన పరుగులు అందించాడు. దీంతో భారత్‌కు 95 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది. మరో పేసర్ మొహ్మద్ సిరాజ్ (7) నాటౌట్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (84; 214 బంతుల్లో 12x4) సెంచరీ చేజార్చుకోగా.. రవీంద్ర జడేజా (56; 86 బంతుల్లో 8x4, 1x6) హాఫ్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలి రాబిన్‌సన్ ఐదు, జేమ్స్ అండర్సన్ నాలుగు వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications












