ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. 41 ఏళ్ల అండర్సన్ ధర్మశాల వేదికగా భారత్‌తో జరుగుతున్న అయిదో టెస్టులో ఈ ఘనత సాధించాడు. కుల్‌దీప్ యాదవ్‌ను ఔట్ చేసి 700 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.
ఓవరాల్‌గా టెస్టుల్లో 700 వికెట్లు తీసిన మూడో బౌలర్ అండర్సన్. అతని కంటే ముందు ముత్తయ్య మురళీథరన్, షేన్ వార్న్ ఈ ఘనత సాధించారు. మురళీథరన్ 800 వికెట్లు, షేన్ వార్న్ 708 వికెట్లు పడగొట్టారు. అండర్సన్ తర్వాతి స్థానాల్లో అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604) ఉన్నారు.

ధర్మశాల టెస్టులో అండర్సన్‌తో పాటు షోయబ్ బషీర్ కూడా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ తరఫున రెండు సార్లు అయిదు వికెట్లు తీసిన 21 ఏళ్లలోపు ఏకైక బౌలర్‌గా బషీర్ రికార్డు సాధించాడు. 21 ఏళ్లు పూర్తికాకముందే అయిదు వికెట్లు సాధించిన ఇంగ్లండ్ బౌలర్లు నలుగురు మాత్రమే. ఈ జాబితాలో షోయబ్ బషీర్‌తో పాటు బిల్ వోస్, జేమ్స్ అండర్సన్, రెహాన్ అహ్మద్ ఉన్నారు.
కాగా, ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 124.1 ఓవర్లకు 477 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఇవాళ మరో నాలుగు పరుగులు మాత్రమే సాధించింది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో కుల్‌దీప్ (30; 69 బంతుల్లో) షాట్‌కు యత్నించి వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్‌లోనే జస్ప్రీత్ బుమ్రా (20; 64 బంతుల్లో) ఔటయ్యాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.
టీమిండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (110; 150 బంతుల్లో), రోహిత్ శర్మ (103; 162 బంతుల్లో) శతకాలతో కదంతొక్కారు. దేవదత్ పడిక్కల్ (65; 103 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (57; 58 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (56; 60 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. జేమ్స్ అండర్సన్, టామ్ హర్ట్‌లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బెన్ స్టోక్స్ ఒక్క వికెట్ తీశాడు.