రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లకు 219 పరుగులు చేసింది. ప్రత్యర్థి కంటే 134 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో ధ్రువ్ జురెల్ (30*; 58 బంతుల్లో), కుల్‌దీప్ యాదవ్ (17*; 72 బంతుల్లో) ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులు చేసింది.
భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లండ్ పైచేయి సాధించింది. రోహిత్ శర్మ (2; 9 బంతుల్లో)ను అండర్సన్ ఔట్ చేశాడు. కానీ ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్ (38; 65 బంతుల్లో).. యశస్వీ జైస్వాల్(73; 117 బంతుల్లో)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. సాధికారికంగా బ్యాటింగ్ చేస్తూ గిల్ క్లాసిక్ బౌండరీలు సాధించాడు. అయితే కుదురుకున్న గిల్‌ను షోయబ్ బషీర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

గిల్ రివ్యూకి వెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన కాల్‌ను థర్డ్ అంపైర్ పరిగణనలోకి తీసుకున్నాడు. అయితే గతేడాది మార్చిలో అహ్మదాబ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో గిల్ సెంచరీ సాధించిన తర్వాత తన ఫామ్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటినుంచి సుదీర్ఘ ఫార్మాట్ మొదటి ఇన్నింగ్స్‌ల్లో గిల్ దారుణంగా విఫలమవుతున్నాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం అదరగొడుతున్నాడు.
అహ్మదాబాద్ టెస్టు అనంతరం గిల్ తన ఫస్ట్ ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 13, 6, 10, 2, 36, 23, 34, 0, 38 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు ఇవాళ సాధించిన 38 పరుగులే. గిల్ 26 సగటుతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం గిల్ అదరగొడుతున్నాడు. 40 సగటుతో పరుగులు సాధిస్తూ సత్తాచాటుతున్నాడు. గత రెండు టెస్టుల్లోని రెండో ఇన్నింగ్స్‌లో అతడు 104, 91 పరుగులతో మెరిశాడు.
కాగా, నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు నిరాశపరిచారు. రజత్ పటిదార్ (17; 42 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (14; 53 బంతుల్లో), రవీంద్ర జడేజా (12; 12 బంతుల్లో), రవిచంద్రన్ అశ్విన్ (1; 13 బంతుల్లో) తక్కువస్కోరుకు వెనుదిరిగారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు, టామ్ హర్ట్‌లీ రెండు, అండర్సన్ ఒక్క వికెట్ పడగొట్టారు.