రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 53.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లండ్ భారత్‌కు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రవిచంద్రన్ అశ్విన్ (5/51), కుల్‌దీప్ యాదవ్ (4/22) మాయాజాలానికి ఇంగ్లిష్ జట్టు విలవిలలాడింది. జాక్ క్రాలే (60; 91 బంతుల్లో) టాప్ స్కోరర్.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను అశ్విన్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో వరుస బంతుల్లో బెన్ డకెట్ (15; 15 బంతుల్లో), ఒలీ పోప్ (0; 1 బాల్)ను ఔట్ చేశాడు. కాసేపటికే ప్రమాదకర బ్యాటర్ జో రూట్ (11; 34 బంతుల్లో)ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కుల్‌దీప్ యాదవ్ కూడా చెలరేగడంతో టీ విరామానికి ఇంగ్లండ్ 120/5తో నిలిచింది.

అయితే ఆఖరి సెషన్‌ను జడేజా వికెట్‌తో ప్రారంభించాడు. కుదుకుకున్న జానీ బెయిర్‌స్టో (30; 42 బంతుల్లో)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత కుల్‌దీప్ ఒకే ఓవర్‌లో టామ్ హర్ట్‌లీ (7; 25 బంతుల్లో), రాబిన్సన్ (0, 3 బంతుల్లో) ఔట్ చేశాడు. అనంతరం ఫోక్స్ (17;76 బంతుల్లో) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ దశలో కెప్టెన్ రోహిత్..అశ్విన్‌కు బంతి అందించడంతో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (11), బెన్ స్టోక్స్ (4) పరుగులు చేశారు.
అంతకుముందు 219/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఇవాళ ఆటను ప్రారంభించిన టీమిండియా 103.2 ఓవర్లకు 307 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ కంటే 46 పరుగుల వెనుకంజతో తొలి ఇన్నింగ్స్ ముగించింది. అయితే వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (90; 149) గొప్పగా పోరాడాడు. కుల్‌దీప్ యాదవ్ (28; 131 బంతుల్లో)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత అరంగేట్ర ప్లేయర్ ఆకాశ్ దీప్ (9; 29 బంతుల్లో)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు.
టీమిండియా బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ (73), రోహిత్ శర్మ (2), శుభ్‌మన్ గిల్ (38), రజత్ పటిదార్ (17), రవీంద్ర జడేజా (12), సర్ఫరాజ్ ఖాన్ (14), అశ్విన్ (1) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అయిదు వికెట్లు, టామ్ హర్ట్‌లీ మూడు, అండర్సన్ రెండు వికెట్లు తీశారు.